కుబీర్‌లో భారీ త్రివర్ణ ర్యాలీ..
కుబీర్, ఆంధ్రప్రభ : 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం కుబీర్ మండల కేంద్రంలో చాణక్య సాంస్కృతిక పాఠశాల ఆధ్వర్యంలో 150 మీటర్ల భారీ భారత త్రివర్ణ పతాక ర్యాలీని ఘనంగా నిర్వహించారు.
ఈ ర్యాలీలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారీ జాతీయ పతాకాన్ని చేతబూని కుబీర్ మండలంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీగా పర్యటించారు. ‘‘భారత్ మాతాకీ జై’’, ‘‘వందేమాతరం’’ వంటి దేశభక్తి నినాదాలతో పరిసర ప్రాంతాలను మార్మోగించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి సేవలను కొనియాడారు. దేశ సమైక్యత, సమగ్రత, సౌభ్రాతృత్వం, దేశభక్తి భావాలను ప్రజల్లో పెంపొందించడమే ర్యాలీ ఉద్దేశమని పాఠశాల ప్రిన్సిపల్ పి. నరేష్, ఉపాధ్యాయులు తెలిపారు. జాతీయ పతాకంతో నిర్వహించిన ఈ భారీ ర్యాలీ స్థానికులను ఆకట్టుకుంది. విద్యార్థుల దేశభక్తి స్ఫూర్తిని పలువురు అభినందించారు.
