తాండూరులో గ్రీన్ బడ్జెట్ గోల్‌మాల్? రూ.35 లక్షల మొక్కలు.. చెత్త కుప్పల్లో!
- రూ.35 లక్షల గ్రీన్ బడ్జెట్‌పై ఆరోపణలు
- 65 వేల మొక్కలు తెప్పించినట్లు లెక్కలు
- సగం మొక్కలు కూడా తాండూరుకు చేరలేదన్న ఆరోపణలు
- మునిసిపల్ కార్యాలయం వెనుక పిచ్చిమొక్కల మధ్య మొక్కలు
- వర్షాలు పడుతున్నా మొక్కలు నాటని అధికారులు
- కాంట్రాక్టర్‌కు పూర్తయిన బిల్లుల చెల్లింపులు
- గ్రీన్ బడ్జెట్ నిధుల దుర్వినియోగంపై చర్యలకు డిమాండ్
వనమహోత్సవం పేరుతో మొక్కలు నాటి పచ్చదనం పెంచాల్సిన అధికారులు.. అందుకు కేటాయించిన నిధుల వినియోగంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాండూరు మునిసిపాలిటీలో గ్రీన్ బడ్జెట్ కింద రూ.35 లక్షలు ఖర్చు చేసి 65 వేల మొక్కలు తెప్పించినట్లు లెక్కలు చూపుతున్నప్పటికీ, అందులో సగం మొక్కలు కూడా పట్టణానికి చేరలేదన్న ఆరోపణలు ఉన్నాయి. తెప్పించిన అరకొర మొక్కలు సైతం మునిసిపల్ కార్యాలయం వెనుక పిచ్చిమొక్కల మధ్య, చెత్త కుప్పల నడుమ దర్శనమిస్తుండటం అధికారుల పనితీరుపై తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
ఆంధ్రప్రభ, వికారాబాద్ జిల్లా ప్రతినిధి: పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల్లో జరిగే పనులను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)ను ప్రభుత్వం నియమించింది. అచ్చంగా స్థానిక సంస్థల ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలను చూడాల్సిన సదరు అధికారి ఇటీవల కాలంలో ఏనాడూ జిల్లా కలెక్టరేట్ దాటి బయటకు వచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. జిల్లాలో నాలుగు పట్టణ స్థానిక సంస్థలు ఉన్నా.. అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా బాధ్యతలు తీసుకున్న అధికారి ఏనాడూ ఒక్క మునిసిపాలిటీని సందర్శించకపోవడం విశేషం. దీంతో స్థానిక సంస్థల్లో ఆడింది ఆట.. పాడింది పాటగా మారింది.
జిల్లాలోని అతిపెద్ద మునిసిపాలిటీగా గుర్తింపు పొందిన తాండూరు పురపాలక సంఘంలో వనమహోత్సవ కార్యక్రమం అధికారుల ధనదాహానికి బలైపోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రీన్ బడ్జెట్ పేరుతో మొత్తం నిధులను మెక్కేశారని ఆరోపణలు వస్తున్నాయి. తీసుకువచ్చిన అరకొర మొక్కలను చెత్తకుప్పకు పరిమితం చేశారు.
కాగితాల్లోనే మొక్కలు
తాండూరులో వనమహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని గ్రీన్ బడ్జెట్ కింద రూ.35 లక్షల నిధులను ఖర్చు చేసేందుకు నిర్ణయించారు. ఈ నిధులతో గత ఏడాది సెప్టెంబర్ మాసంలో సీఆర్ (కౌన్సిల్ తీర్మానం) తీసుకున్నారు. అప్పట్లో పాలకవర్గం లేకపోవడంతో ప్రత్యేక అధికారి అనుమతి తీసుకున్నారు. ఆ తరువాత నవంబర్ నాటికి మొక్కలను తెప్పించడం.. బిల్లుల చెల్లించడం పూర్తి చేశారు.
మొత్తం 13 రకాల మొక్కలను తెప్పించినట్లు లెక్కలు చూపించారు. మొక్కల రకాన్ని బట్టి ఒక్కో మొక్కకు కనిష్టంగా రూ.15 చెల్లించగా, గరిష్టంగా రూ.40 చెల్లించారు. ఇలా మొత్తం 65 వేల మొక్కలను తాండూరు మునిసిపల్ అధికారులు తెప్పించినట్లు లెక్కలు చూపించారు. ఇందులో సగం మొక్కలు కూడా తాండూరుకు చేరుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక ఒక్కో మొక్కపై చేసిన ఖర్చును కూడా రెండింతలు.. మూడింతలు చేసి చూపించినట్లు సమాచారం.
గ్రీన్ బడ్జెట్‌కు ఎసరు
గ్రీన్ బడ్జెట్ కింద తెప్పించిన అరకొర మొక్కలను తాండూరు మునిసిపల్ కార్యాలయం వెనుక భాగంలోని నీటి ట్యాంకు పక్కన ఉంచారు. అక్కడ మొక్కలు నెలల తరబడి ఉన్నాయి. వాటికి నిర్వహణ లేకపోవడంతో మొక్కల కంటే పిచ్చిమొక్కలు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. మొక్కలు ఉంచిన ప్రదేశం పిచ్చిమొక్కలతో నిండిపోయింది. అక్కడ రూ.35 లక్షలు ఖర్చు చేసి తెప్పించిన మొక్కలు ఉన్నాయంటే ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. దీనిని బట్టి తాండూరు మునిసిపల్ అధికారులు వనమహోత్సవ కార్యక్రమం పట్ల చూపించిన శ్రద్ధ ఏపాటిదో అర్థమవుతోంది.
గత కొద్ది రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. అయినా అధికారుల్లో చలనం లేదు. తెప్పించిన మొక్కలు మునిసిపల్ కార్యాలయంలోనే ఉన్నాయని తెలిసినా వాటిని నాటించాలనే సోయి కరువైంది.
ఇక గ్రీన్ బడ్జెట్ కింద అక్షరాలా రూ.35 లక్షల నిధులను మొక్కలను పంపిణీ చేసిన కాంట్రాక్టర్‌కు అధికారులు చెల్లింపులు కూడా చేయడం మరో విశేషం. ఇందులో అధికారులు ఎవరి వాటా వారు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
వనమహోత్సవ కార్యక్రమాన్ని తాండూరు మునిసిపాలిటీలో ఇంతగా అశ్రద్ధ చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు గ్రీన్ బడ్జెట్ నిధులను దుర్వినియోగం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.
