22 ఏ భూములపై సీఎం భరోసా..

  • హక్కుదారులకు అన్యాయం జరగదు..
  • ఇందిరమ్మ టవర్స్‌కు శ్రీకారం..
  • పేదలకు ఇళ్లు.. భూముల సమస్యలకు పరిష్కారం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : నిషేధిత జాబితా (22 ఏ)లో ఉన్న భూములకు సంబంధించి హక్కుదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఏదైనా కారణంతో భూములు 22 ఏ జాబితాలో చేరినా.. వాటి హక్కుదారులకు అన్యాయం జరగదని స్పష్టం చేశారు. నిషేధిత జాబితాలో చేరిన భూముల సర్వే నంబర్లకు బై నంబర్లు ఇచ్చి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

హైదరాబాద్‌ కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో కోర్ అర్బన్ (క్యూర్) ప్రాంత పరిధిలో ఇందిరమ్మ ఇండ్లు (టవర్స్) నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

అనంతరం స్థానిక ప్రజలతో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కూకట్‌పల్లి ప్రాంతంలో ఉన్న భూముల సమస్యలను ప్రస్తావించారు. ముఖ్యంగా నిషేధిత జాబితాలో చేరిన భూముల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.

“ఏదైనా కారణంగా మీ భూమి 22 ఏలో చేరి ఉంటే.. కొనుగోలు చేసిన హక్కుదారుల స్థలాలు ఎక్కడికీ పోవు. నేను హామీ ఇస్తున్నాను. కోర్టు కేసుల్లో ఉన్న భూములకు సంబంధించి సర్వే నంబర్‌లో ఉన్న మొత్తం భూములను నిషేధిత జాబితాలో చేర్చారు. అయితే కోర్టు కేసులు ఉన్న స్థలాలను పక్కన పెట్టి మిగిలిన భూములకు బై నంబర్లు ఇచ్చి పరిష్కరిస్తున్నారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని సీఎం స్పష్టం చేశారు.

కూకట్‌పల్లి ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. “ఈ ప్రాంత ప్రజలకు ఏం కావాలన్నా పనులు చేయించుకోండి. ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. రోడ్లు, ఫ్లైఓవర్లు, చెరువుల పునరుద్ధరణ, విద్యా సంస్థలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం అవసరమైన పరిశ్రమలు వంటి అంశాల్లో నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా చూడాలి” అని వేదికపై ఉన్న మంత్రి శ్రీధర్ బాబుకు సూచించారు.

అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రజలు గత పాలనను, ప్రస్తుత రెండేళ్ల పాలనను పరిశీలించాలని ముఖ్యమంత్రి అన్నారు. గత ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను నిలిపివేయలేదని, వాటితో పాటు కొత్త సంక్షేమ కార్యక్రమాలను కూడా చేపట్టామని వివరించారు.

“రాష్ట్రంలోని 3.28 కోట్ల మంది ప్రజలకు ప్రతి ఒక్కరికీ 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందిస్తున్నాం. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశాం” అని సీఎం తెలిపారు.

మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల అనేక కుటుంబాలకు ఆర్థికంగా ప్రయోజనం కలుగుతోందని చెప్పారు. “ఉద్యోగాలు, ఉపాధి, చదువుల కోసం వెళ్లే మహిళలు నెలకు ఆరేడు వేల రూపాయలు ఆదా చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆర్టీసీకి రూ.12 వేల కోట్లు చెల్లించాం. స్వయం సహాయక సంఘాలకు రూ.65 వేల కోట్ల బ్యాంకు లింకేజీ అందించాం. వాటికి రూ.2,500 కోట్ల వడ్డీ చెల్లించాం” అని వివరించారు.

మహిళా సంఘాల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను కూడా ముఖ్యమంత్రి వివరించారు. “మహిళా సంఘాల పేరుతో వెయ్యి బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చాం. వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించాం. ఆదిలాబాద్ అడవుల నుంచి అచ్చంపేట వరకు ఆడబిడ్డలు తయారు చేసిన వస్తువులను విక్రయించుకునేందుకు శిల్పారామంలో మూడున్నర ఎకరాల విలువైన స్థలాన్ని కేటాయించి ఇందిరా మహిళా బజార్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం” అని తెలిపారు.

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. “రెండేళ్లు పూర్తయ్యేలోపు ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం” అని చెప్పారు.

కూకట్‌పల్లి ప్రాంతంలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం ఒక ప్రత్యేకమైన కార్యక్రమమని సీఎం పేర్కొన్నారు. “కూకట్‌పల్లిలో వందల కోట్ల విలువ చేసే 11 ఎకరాల భూమిలో మంచి సంకల్పంతో ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తున్నాం. నగరంలో నిరుపేదలు ఎవరు ఎక్కడ నివసిస్తున్నారో గుర్తించి వారికి అక్కడే ఇళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం” అని తెలిపారు.

పేదల కోసం నిర్మించే ఇళ్ల విషయంలో రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా రద్దు చేయాలని ముఖ్యమంత్రి మంత్రులకు సూచించారు. “నిరుపేదలకు అందించే ఇళ్ల స్థలాన్ని పూర్తిగా ఉచితంగా అందిస్తున్నాం. నిర్మాణ వ్యయంలో ఐదారు లక్షల రూపాయలు లబ్ధిదారులు భరిస్తే.. ఆ ఇంటి నిర్మాణ ప్రక్రియలో వారికి భాగస్వామ్యం ఉంటుంది. నిర్మాణ పనులను పరిశీలించే హక్కు కూడా ఉంటుంది” అని వివరించారు.

నిరుపేదలకు సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం అన్నారు. “సొంత ఇల్లు కావాలనే ప్రతి పేద కుటుంబం ఆశను నెరవేర్చేందుకు నూటికి నూరు శాతం అండగా ఉంటాం. మొదటి విడతగా కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, కంటోన్మెంట్, ఎల్బీనగర్, ఉప్పల్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా పేదలు నివసించే వారికి ఇళ్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం” అని తెలిపారు.

ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి నివసిస్తున్న వారికి కూడా మెరుగైన నివాస సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.

గతంలో ప్రభుత్వ పనుల కోసం ప్రజలు గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ల చుట్టూ తిరగాల్సి వచ్చేదని సీఎం అన్నారు. ప్రజలకు పరిపాలన మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో సైబరాబాద్ కమిషనరేట్ ఏర్పాటు చేశామని తెలిపారు.

“మీ అభివృద్ధి కోసం నిలబడతాను. పది మందికి మేలు చేయాలనే ఆలోచనతో పనిచేస్తున్నాను. మంచి చేయాలంటే చిత్తశుద్ధి, మంచి ఆలోచన అవసరం. విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు తీసుకెళ్లేందుకు రోజుకు 18 గంటలు పనిచేసే శక్తిని దేవుడు ఇచ్చారు. ప్రజల ఆశీర్వాదం ఉంటే మరింత ముందుకు వెళ్తాం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.