గుడివాడలో విద్యుత్ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష

విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు

గుడివాడ, ఆంధ్రప్రభ : ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా అనేక చర్యలు విజయవంతంగా తీసుకుంటున్నట్లు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. విద్యుత్ వ్యవస్థలో కూటమి ప్రభుత్వ హయాంలో వచ్చిన మార్పులను ప్రజలందరూ గుర్తించాలని కోరారు. గుడివాడ నియోజకవర్గంలో జరుగుతున్న విద్యుత్ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అధికారులతో సమీక్ష నిర్వహించారు. గురువారం ఉదయం ప్రజా వేదిక కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో సమావేశమైన ఆయన.. నియోజకవర్గంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలతో పాటు భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులపై చర్చించారు.

గుడివాడ పట్టణంతో పాటు గ్రామాల్లో గత రెండు నెలలుగా నెలకొన్న తక్కువ వోల్టేజీ సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలు, నూతన విద్యుత్ లైన్ల ఏర్పాటు, మరమ్మతులు చేసిన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు సంబంధించిన వివరాలను అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. ప్రజా దర్బార్‌తో పాటు నియోజకవర్గంలో తన పర్యటనల సందర్భంగా ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే రాము.. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. గత సమావేశంలో సూచించిన సమస్యల్లో 90 శాతానికి పైగా పరిష్కారం కావడంపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు.

సమస్యల పరిష్కారంలో అధికారులు చేస్తున్న కృషిని అభినందించారు. రాష్ట్ర సగటుతో పోలిస్తే గుడివాడ విద్యుత్ ఫీడ్‌బ్యాక్ ఒక శాతం మెరుగ్గా ఉందని అధికారులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. నియోజకవర్గంలో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణం, కొత్త విద్యుత్ ఫీడర్ల ఏర్పాటుపై విద్యుత్ శాఖ సీఎండీ పుల్లారెడ్డితో ఎమ్మెల్యే రాము ఫోన్‌లో మాట్లాడారు. ఇప్పటికే విద్యుత్ సమస్యలను మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి తీసుకెళ్లామని, మంత్రి సానుకూలంగా స్పందించారని సీఎండీకి తెలిపారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో గుడివాడ నియోజకవర్గంలో రూ.14 కోట్లతో విద్యుత్ పనులు చేపట్టామని ఎమ్మెల్యే రాము తెలిపారు.

మరో రూ.11 కోట్ల పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని, మరో రూ.1.52 కోట్ల విలువైన పనులకు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. నందివాడ మండలంలో దశాబ్దాలుగా పరిష్కారం కాని విద్యుత్ సమస్యలను పరిష్కరించడంతో పాటు విద్యుత్ వ్యవస్థలు సరిగా లేని గ్రామాల్లో నూతన లైన్లు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. గుడివాడ పట్టణం, ఇతర గ్రామాల్లో అధిక లోడ్ ఉన్న ప్రాంతాల్లో ఫీడర్ల విభజన, అవసరమైన చోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు ఆక్వా రంగానికి విద్యుత్ సమస్యలు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు.

ఇంకా చేయాల్సిన విద్యుత్ పనులన్నీ పూర్తి చేస్తామని, ఆర్థిక పరిస్థితుల కారణంగా కొన్ని పనుల్లో కొంత ఆలస్యం జరుగుతోందని తెలిపారు. గతానికి, ఇప్పటికీ విద్యుత్ వ్యవస్థలో వచ్చిన మార్పును ప్రజలు గమనించాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కోరారు. సమీక్ష సమావేశంలో ఎలక్ట్రికల్ డీఈ జి.బి. శ్రీనివాసరావు, టౌన్ ఎలక్ట్రికల్ ఏడీ బాపిరాజు, గుడ్లవల్లే ఏడీ కిరణ్, ఎలక్ట్రికల్ ఏఈలు ఉష, బ్రహ్మానందరావు, కుమార్, సూర్య ప్రకాష్, శ్యామల, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.