ఆ అయిదుగురు గంజాయి సేవించలేదు..
- డ్రగ్స్ పరీక్షల్లో వలస కూలీలకు నెగిటివ్
కమలాపూర్, ఆంధ్రప్రభ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో మంగళవారం రాత్రి వలస కూలీలు గంజాయి సేవించి ఒకరిపై ఒకరు పరస్పర దాడులకు పాల్పడ్డారంటూ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని డ్రగ్స్ పరీక్షలకు పంపగా వారు ఎలాంటి డ్రగ్స్ సేవించలేదని పరీక్షల్లో నిజనిర్ధారణ అయింది.
ఈ విషయంపై ఈరోజు స్థానిక పోలీస్ అధికారులు స్పందించి వాస్తవాలను వెల్లడించారు. మధ్యప్రదేశ్ కు చెందిన రామ్ కుమార్, రాజీవ్, రాజకుమార్, హరి మోహన్, రాంపాల్ అనే ఐదుగురు వలస కూలీలు ఉపాధి కోసం గత కొంతకాలంగా కమలాపూర్ లో నివాసం ఉంటున్నారు. అట్టి ఐదుగురు డ్రగ్స్ సేవించి ఒకరిపై ఒకరు నడిరోడ్డుపై పరస్పర దాడులు చేసుకున్నారంటూ కొన్ని సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందని, అట్టి వార్త లో ఎలాంటి నిజం లేదని స్థానిక పోలీస్ అధికారులు ఖండించారు.
వరంగల్ లోని ఎంజీఎంలో ఆ ఐదుగురు వ్యక్తులకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా నెగటివ్ రిపోర్టు వచ్చిందని వారు ఎలాంటి డ్రగ్స్ సేవించలేదని ఇలాంటి తప్పుడు వార్తల వలన సమాజంలో ప్రజలు, వారి కుటుంబ సభ్యులు కొంత ఆందోళనకు గురికావాల్సి వస్తుందన్న విషయాన్ని మీడియా వారు గమనించాలని ఈ సందర్భంగా పోలీస్ అధికారులు కోరారు. ఇలాంటి కథనాలు ప్రచారం చేసేముందు పోలీస్ వివరణ తెలుసుకోవాలని అలాంటప్పుడే తప్పుడు కథనాలకు అవకాశం ఉండదని మీడియా మిత్రులు పోలీసులతో కలిసి సహకరించాలని ఈ సందర్భంగా స్థానిక పోలీస్ అధికారులు కోరారు.
