హైడ్రా రాష్ట్రవ్యాప్తం చేయాలి..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణలో వేగంగా జరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో చెరువులు, కాలువలు, పార్కులు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రా సేవలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని పలు జిల్లాల ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రతినిధులు హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ను కలిసి తమ మద్దతు తెలిపారు.

హైదరాబాద్‌లో హైడ్రా వ్యవస్థ ముందుగానే ఏర్పాటై ఉంటే నగరంలోని గొలుసుకట్టు చెరువుల్లో చాలా వరకు కాపాడుకునే అవకాశం ఉండేదని ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. నగరంలో చోటుచేసుకున్న పరిస్థితులు ఇతర పట్టణాల్లో పునరావృతం కాకుండా ఉండాలంటే హైడ్రా తరహా వ్యవస్థను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించాలని కోరారు.

నిజామాబాద్‌, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలకు చెందిన స్పీక్‌ (సొసైటీ ఫర్‌ పీపుల్స్‌ ఎంపవర్‌మెంట్‌ విత్‌ యాక్షనబుల్‌ నాలెడ్జ్‌) ప్రతినిధులు హైడ్రా కమిషనర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

తప్పుడు సమాచారంతో కోర్టులను, ప్రభుత్వ శాఖలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలపై అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. చెరువులు, కుంటలు, వరద కాలువల ఆక్రమణలను అడ్డుకోవడం ద్వారా వరద సమస్యలను కొంతమేర తగ్గించవచ్చని పేర్కొన్నారు.

ఇటీవల వరంగల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో వచ్చిన వరద పరిస్థితులు పట్టణ ప్రణాళికలో నీటి వనరుల రక్షణ ఎంత కీలకమో తెలియజేశాయని తెలిపారు. చెరువులు, వాగులు, వరద కాలువలు ఆక్రమణలకు గురికాకుండా కాపాడితే భవిష్యత్‌లో వరద ముప్పును తగ్గించే అవకాశం ఉంటుందని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా తరహా వ్యవస్థ అందుబాటులోకి వస్తే అక్రమ ఆక్రమణలకు అడ్డుకట్ట పడటంతో పాటు ప్రజా ఆస్తులను కబ్జా చేసే వారికి భయం ఏర్పడుతుందని ప్రతినిధులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, చెరువుల రక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ కోసం మరింత బలమైన చర్యలు చేపట్టాలని కమిషనర్‌ను కోరారు.