స్టైఫండ్‌ కోసం జూడాల సమ్మె

  • 30 శాతం పెంపు కోరుతున్న జూనియర్‌ డాక్టర్లు..
  • 3 శాతానికే ప్రభుత్వం ప్రతిపాదన
  • ఓపీ, ఇతర సేవలకు దూరం..
  • అత్యవసర సేవలపై ప్రభావం లేకుండా ఆందోళన
  • ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు రిలే నిరాహార దీక్షలు
  • తెలంగాణ తరహా స్టైఫండ్‌ కావాలంటున్న జూడాలు

అన్ని అంశాలపై చర్చిస్తున్నాం
ఇంటర్న్‌షిప్‌ వ్యవధి తక్కువగా ఉన్న మాట వాస్తవమే: మంత్రి సత్య కుమార్

విజయవాడ, ఆంధ్రప్రభ: స్టైఫండ్‌ను 30 శాతం పెంచాలన్న డిమాండ్‌తో ఆంధ్రప్రదేశ్‌ జూనియర్‌ డాక్టర్లు సమ్మె బాట పట్టారు. ప్రభుత్వం 3 శాతం పెంపునకు మాత్రమే ప్రతిపాదన చేయడంతో ఇరువర్గాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. తమ డిమాండ్ల సాధనలో భాగంగా బుధవారం నుంచి జూనియర్‌ డాక్టర్లు ఓపీ, ఇతర సాధారణ సేవలకు దూరంగా ఉంటూ ఆందోళన చేపట్టారు.

రాష్ట్రవ్యాప్తంగా హాస్పిటల్స్, యూనివర్సిటీల ముందు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. జూనియర్‌ డాక్టర్లు తెలంగాణలో అమలవుతున్న స్థాయిలో స్టైఫండ్‌ ఇవ్వాలని కోరుతున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. జూడాల డిమాండ్లపై ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తోందన్నారు. తెలంగాణ రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ లోటుతో ఉందని వివరించారు. అదే సమయంలో ఇంటర్న్‌షిప్‌ వ్యవధి తక్కువగా ఉన్న విషయం వాస్తవమేనని, ఈ అంశంతో పాటు జూనియర్‌ డాక్టర్లు లేవనెత్తిన అన్ని డిమాండ్లపై ప్రభుత్వం చర్చిస్తోందని మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు.

స్టైఫండ్‌ పెంపుతో పాటు తమ సమస్యలను పరిష్కరించాలని జూడాలు కొంతకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. చర్చల్లో 30 శాతం పెంపు కోరిన జూడాలకు ప్రభుత్వం 3 శాతం పెంపు ప్రతిపాదించడంతో అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో దశలవారీ ఆందోళనకు దిగారు. తాజా సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ వైద్య సేవలపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో ప్రభుత్వం, జూడాల మధ్య చర్చలు కీలకంగా మారాయి.