విత్తనం నాటిన ప్రతి రైతుకు ఫసల్ బీమా

  • రైతుల ఆర్థిక భద్రతకు 100 శాతం ఫసల్ బీమా నమోదు
  • జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ

విజయవాడ, ఆంధ్రప్రభ: విజయవాడ కలెక్టరేట్ నుండి కలెక్టర్ లక్ష్మీశ.. జిల్లా రెవిన్యూ అధికారి యం.లక్ష్మీ నరసింహo, జిల్లాస్థాయి అధికారులతో కలసి కలెక్టర్ కార్యాలయం నుంచి ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వివిధ శాఖల క్షేత్రస్థాయి అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మిశ మాట్లాడుతూ ఆగస్టు 15వ తేదీతో ఫసల్ బీమా నమోదు గడువు ముగియనున్నందున జిల్లాలో 100 శాతం నమోదు లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు.

ప్రతి మండలంలో పంట మార్పిడిపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, రైతులు చేపట్టిన పంట మార్పిడి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. జిల్లాలో ప్రస్తుతం 6,800 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, రైతులకు ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎరువుల దుకాణాల వద్ద కలెక్టరేట్ యూనిఫైడ్ కాల్ సెంటర్ 91549 70454 హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రదర్శించాలని సూచించారు. వర్షాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో ప్రతి రైతుకు సీడ్ పెల్లెటింగ్ సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు.

తక్కువ వర్షపాతం పరిస్థితుల్లో మొలక శాతం మెరుగుపడేందుకు ఇది దోహదపడుతుందని, రైతులకు అవసరమైన శిక్షణ అందించాలని సూచించారు. భూగర్భ జలాలను పెంచేందుకు తహసీల్దార్లు, ఎంపీడీవోల సమన్వయంతో ఫారం పాండ్ల నిర్మాణ లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. 1.30 లక్షల లక్ష్యంలో వచ్చే ఏడాదికి 65 వేల కొత్త ఫారం పాండ్లను పూర్తి చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలని, అంటువ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు, క్లోరినేషన్ కార్యక్రమాలను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఆదర్శ గ్రామ యోజనలో టెండర్లు, అగ్రిమెంట్లు పూర్తిచేసి పనులను వెంటనే ప్రారంభించాలని, కలెక్టర్ తదుపరి సమీక్ష నాటికి 50 శాతానికి పైగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

అంగన్‌వాడీ కేంద్రాల్లో మంచినీరు, టాయిలెట్లు, ఆర్‌ఓ ప్లాంట్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని, వారంలోగా స్పష్టమైన పురోగతి సాధించాలని ఆదేశించారు. అన్ని అంగన్‌వాడీలు, పాఠశాలలకు ట్యాప్ కనెక్షన్లు ఉన్నట్లు ఎంపీడీవోలు, పంచాయతీల నుంచి అండర్‌టేకింగ్ తీసుకోవాలని సూచించారు. నెట్ జీరో’ లక్ష్య సాధనలో భాగంగా జిల్లాలో విస్తృత స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని కలెక్టర్ సూచించారు. వరద పరిస్థితులను ఎదుర్కొనే సన్నద్ధత, 22ఏ దరఖాస్తుల పరిష్కారం తదితర అంశాలపై కూడా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయంతో అమలు చేసి జిల్లాను రాష్ట్రంలో ముందంజలో నిలపాలని జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.

జూమ్ కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ ఎం.లక్ష్మీనరసింహం, వివిధ శాఖల జిల్లా అధికారులు, డివిజనల్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.