Black Magic Fraud | రోబోల యుగంలోనూ.. మూఢనమ్మకాల మాయలో మనిషి!

Black Magic Fraud | రోబోల యుగంలోనూ.. మూఢనమ్మకాల మాయలో మనిషి!

టెక్నాలజీ ఓ వైపు.. మూఢనమ్మకాలు మరోవైపు

బొగ్గు నుంచి బంగారం అంటూ రూ.కోటి మోసం

రూ.20 లక్షలు తీసుకుని చేతబడి బెదిరింపులు

కోర్టులోనే క్షుద్రపూజలు

    Black Magic Fraud | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: పాఠశాలలోని విద్యార్థులు రోబోలను తయారు చేసి వాటితో ప్రయోగాలు చేస్తుంటే.. మరోవైపు అదే సమయంలో కొందరు ఇప్పటికీ క్షుద్రపూజలు చేస్తే బంగారం పుడుతుందని నమ్ముతున్నారు. చిన్నారుల చేతుల్లో రోబోటిక్స్‌.. కృత్రిమ మేధస్సు పాఠాలు కనిపిస్తుంటే.. అమాయకుల చేతుల్లో మూఢనమ్మకాల పేరుతో కోట్ల రూపాయలు పోతున్నాయి. సాంకేతికత పరుగులు తీస్తున్న వేగానికి, మనిషి ఆలోచనా విధానం మాత్రం కొన్ని సందర్భాల్లో ఇంకా వెనక్కి నడుస్తుండటం ఆందోళన కలిగించే విషయం. ప్రపంచం కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్‌, అంతరిక్ష సాంకేతికత వైపు దూసుకుపోతోంది. వివిధ సంస్థలు సొంతంగా రాకెట్లను అభివృద్ధి చేసి అంతరిక్షంలోకి పంపే దిశగా ప్రయోగాలు సాగిస్తున్నాయి. ఇంతటి శాస్త్రీయ పురోగతి జరుగుతున్న కాలంలోనూ.. క్షుద్రపూజలు చేస్తే బంగారం పుడుతుందని, నల్లని బొగ్గు మేలిమి బంగారంగా మారుతుందని, రూ.లక్ష ఇస్తే వాటిని రెండింతలు చేస్తామని చెబితే నమ్మేవారు ఉండటం మాత్రం ఆలోచించాల్సిన విషయమే. మూఢనమ్మకాలు ఎంతగా వేళ్లూనుకున్నాయో చెప్పడానికి ఇటీవలి ఘటనలే నిదర్శనం.

    గుప్త నిధుల పేరుతో రూ.1 కోటి మోసం

    హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో ఇళ్ల కింద విలువైన నిధి నిక్షేపాలు ఉన్నాయని నమ్మించి ఓ ముఠా భారీ మోసానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. నలుగురు సభ్యుల ముఠా.. ఇళ్ల కింద ముందుగానే గుంతలు తవ్వి బొగ్గు, నకిలీ బంగారు పూత పూసిన నాణేలు, మట్టిని పాతిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. తాము చెప్పిన ప్రత్యేక పూజలు చేస్తే భూమిలోని బొగ్గు బంగారంగా మారుతుందని బాధితులను నమ్మించారు. ఆ తర్వాత పూజలు, పరిహారాల పేరుతో వారి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇలా మొత్తం 11 మందిని మోసం చేసి సుమారు రూ.1 కోటి వరకు కాజేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇలాంటి ముఠాలు ఒక్కసారిగా పుట్టుకొచ్చినవి కావు. అమాయకుల భయాలు, ఆశలు, అత్యాశలను ఆసరాగా చేసుకుని డబ్బు దండుకునే ప్రయత్నాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఈ ఘటనలో పోలీసులు నిందితులను అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపినా.. ఇలాంటి మోసాలకు అసలు ముగింపు ఎప్పుడు అన్నదే ప్రశ్న.

    రూ.20 లక్షలు తీసుకుని.. చేతబడి చేస్తానని బెదిరింపు

    శంషాబాద్‌లో వెలుగుచూసిన మరో ఘటన మరింత ఆందోళన కలిగిస్తోంది. పూజలు, ప్రత్యేక పరిహారాలు చేస్తానని నమ్మించి ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నుంచి రూ.20 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్నారై పూజారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డబ్బులు తిరిగి అడిగినప్పుడు చేతబడి చేస్తానంటూ బాధితుడిని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితుడిపై గతంలోనే కేసు నమోదై, అతడిని పట్టుకునేందుకు లుక్‌అవుట్‌ నోటీసు జారీ చేశారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన అతడిని శంషాబాద్‌ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఈ వ్యవహారంలో మరికొందరు బాధితులు ఉన్నారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    ఏకంగా కోర్టు గదిలోనే క్షుద్రపూజలు

    న్యాయం కోసం కోర్టును ఆశ్రయించే కాలంలో.. తీర్పు తమకు అనుకూలంగా రావాలని కోర్టు గదిలోనే క్షుద్రపూజలు చేసిన ఘటన కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌లో సంచలనం సృష్టించింది. తన కుటుంబానికి సంబంధించిన కేసులో అనుకూల తీర్పు రావాలని కోరుకున్న 65 ఏళ్ల మహిళ.. కోర్టు కార్యకలాపాలు ప్రారంభం కాకముందే న్యాయమూర్తి కూర్చునే కుర్చీ వద్దకు వెళ్లి మంత్రించిన ఆవాలు చల్లినట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఆమెను గుర్తించి అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

    మారాల్సింది ఎవరు?

    ప్రపంచ దేశాలు భవిష్యత్తు సాంకేతికత కోసం పోటీపడుతున్నాయి. కానీ మనిషి మాత్రం ఇంకా బొగ్గు బంగారంగా మారుతుందని నమ్మితే.. సమస్య సాంకేతికతలో లేదు. ఆలోచనలో ఉంది. మూఢనమ్మకాలు ఒక్కరోజులో పోవు. వాటిని తరిమికొట్టడానికి శాస్త్రీయ దృక్పథం అవసరం. ఏదైనా అద్భుతం జరుగుతుందని చెప్పేవారిని ప్రశ్నించాలి. బంగారం పుడుతుందని, నిధులు బయటపడతాయని, పూజలతో సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పేవారి మాటలను గుడ్డిగా నమ్మకూడదు. ముఖ్యంగా భయం, ఆశ, అత్యాశలను ఆసరాగా చేసుకుని డబ్బులు వసూలు చేసేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. పోలీసులు కూడా ఇలాంటి మోసాలపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సైన్స్‌ ఎంత ముందుకు వెళ్లినా.. సమాజం కూడా అదే స్థాయిలో ఆలోచనలో ముందుకు వెళ్లినప్పుడే ఆ పురోగతికి అసలైన అర్థం ఉంటుంది. రోబోలు తెలివిగా మారుతున్నాయా? అన్న ప్రశ్న కంటే.. రోబోల యుగంలో మనిషి ఎప్పుడు శాస్త్రీయంగా ఆలోచించడం నేర్చుకుంటాడన్నదే అసలు ప్రశ్న. అందుకే ఇక్కడ మారాల్సింది రోబోలు కాదు.. సాంకేతికత అంతకన్నా కాదు.. అమాయక జనాల ఆలోచనా విధానం. అయినా క్షుద్రపూజలకు అంతటి శక్తి ఉంటే.. ఆ పూజలు చేసే వారే మంత్రాలు, క్షుద్రపూజలు చేసుకొని కోటీశ్వరులు కావచ్చుకదా.. ఇంత చిన్న లాజిక్ జనాలు ఎందుకు మిస్ అవుతున్నారు..?