ఇద్దరమ్మాయిల ప్రేమ.. చివరికి…
కుటుంబాల నిరాకరణతో బెంగళూరుకు.. చివరకు బలవన్మరణం
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ప్రేమకు కులం, మతం మాత్రమే కాదు.. లింగ భేదం కూడా అడ్డంకి కాదని భావించిన ఇద్దరు యువతుల ప్రేమకథ విషాదాంతమైంది. నేపాల్‌కు చెందిన సిరిజన (22), రీతా (23) బంధువులు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. వివాహం చేసుకోకుండానే కలిసి జీవించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
అయితే వీరి సంబంధాన్ని కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ఇద్దరూ నేపాల్ నుంచి బెంగళూరుకు వచ్చి కలిసి జీవిస్తున్నట్లు తెలుస్తోంది. తమ ప్రేమను కుటుంబాలు, సమాజం అంగీకరించడం లేదన్న మనస్తాపంతో తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఘటనకు ముందు తమ పరిస్థితిని వివరిస్తూ ఓ లేఖ రాసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఇద్దరూ ఒకే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇద్దరు యువతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. వారి సంబంధాన్ని కుటుంబ సభ్యులు ఎందుకు వ్యతిరేకించారు, బెంగళూరులో వారు ఎక్కడ నివసించారు తదితర అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
