ఇంతియాజ్ హత్యపై టీడీపీ ఆగ్రహం
- కుట్రదారులను గుర్తించి కఠినంగా శిక్షించాలి
- పి. నాగరాజు యాదవ్
కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ: కర్నూలు నగరంలో టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ హత్యను జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పి. నాగరాజు యాదవ్ తీవ్రంగా ఖండించారు. హత్య వెనుక ఉన్న అసలు కుట్రదారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కర్నూలులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సమావేశంలో కర్నూలు నగర టీడీపీ అధ్యక్షుడు కొరకంచి రవికుమార్, హజ్ కమిటీ సభ్యుడు మన్సూర్ అలీ ఖాన్, కర్నూలు పార్లమెంట్ తెలుగుయువత అధ్యక్షుడు ఎస్. అబ్బాస్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ ముంతాజ్తో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పి. నాగరాజు యాదవ్ మాట్లాడుతూ.. కర్నూలు నగరంలో భయాందోళనలు సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలనే ఉద్దేశంతో ప్రత్యర్థులు కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇంతియాజ్ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడిన నాయకుడని, గతంలో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి ప్రజాసేవలో చురుకుగా పనిచేశారని పేర్కొన్నారు.
హంద్రీ పరివాహక ప్రాంతంలో భూకబ్జాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఇంతియాజ్ ధైర్యంగా పోరాటం చేశారని గుర్తు చేశారు. రెండు నెలల క్రితమే మరో టీడీపీ కార్యకర్తపై హత్యాయత్నం జరిగిందని, ఇప్పుడు ఇంతియాజ్ హత్య జరగడం అత్యంత బాధాకరమని అన్నారు.
ఘటన అనంతరం రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి. భరత్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నారని ఆరోపించిన ఆయన, మంత్రి టి.జి. భరత్ నాయకత్వంలో కర్నూలు మేయర్ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంటుందనే విషయాన్ని జీర్ణించుకోలేక ప్రత్యర్థులు నగరంలో భయానక వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
ఇంతియాజ్ హత్య కేసును సమగ్రంగా దర్యాప్తు చేసి అసలు నిందితులను గుర్తించి చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని పోలీసు శాఖను కోరారు. కర్నూలు నగరం ఎప్పటినుంచో సామరస్యానికి, శాంతియుత సహజీవనానికి ప్రతీకగా నిలిచిందని, అలాంటి నగరంలో సామాజిక మాధ్యమాల్లో ఏర్పడిన విభేదాలను కారణంగా చూపుతూ హత్యలకు పాల్పడటం దురదృష్టకరమని అన్నారు.
మంత్రి టి.జి. భరత్ అన్ని వర్గాలు, అన్ని మతాల ప్రజలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ నగర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉన్న కర్నూలును అశాంతి వైపు నెట్టే ఇటువంటి దుశ్చర్యలను ప్రజలు ఎప్పటికీ సమర్థించరని, నగరంలో శాంతిభద్రతలను పరిరక్షించేలా పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని వారు కోరారు.
