అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
ఎమ్మిగనూరు, ఆంధ్రప్రభ: మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయ ఎమ్మిగనూరు మండలంలో పర్యటించి అంగన్వాడీ కేంద్రాల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలు 73, 75, 60, 58లను సందర్శించి పిల్లలకు అందుతున్న పూర్వ ప్రాథమిక విద్య, పోషకాహారం, కేంద్రాల పరిశుభ్రత, మౌలిక సదుపాయాల వినియోగం తదితర అంశాలను పరిశీలించారు. ప్రభుత్వం అందించిన ఇండక్షన్ స్టవ్‌లను తప్పనిసరిగా వినియోగిస్తూ సురక్షితమైన, పరిశుభ్రమైన వంట విధానాలను పాటించాలని అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు.
అనంతరం ఎమ్మిగనూరు అంగన్వాడీ కేంద్రం నం.15లో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల్లో ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు, వారి కుటుంబ సభ్యులతో ఆమె ముఖాముఖిగా మాట్లాడారు. తల్లిపాల ప్రాముఖ్యత, శిశువు పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వడం, తొలి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలనే అందించడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. తల్లికి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా భర్తలు పూర్తి సహకారం అందించాలని సూచించారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు అలాగే చిన్నారులకు అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని, తల్లి, శిశువు ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన పోషకాహారం, ఆరోగ్య సూచనలను పాటించాలని ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయ తెలిపారు.

