కనకదుర్గమ్మ గుడికి మోక్షం ఎప్పుడు

పూర్వ వైభవం కోసం ఎదురుచూస్తున్నభక్తులు

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: గ్రామాన్ని కంటికి రెప్పలా కాపాడే గ్రామదేవత… కష్టకాలంలో అండగా నిలిచే అమ్మవారు… అలాంటి కనకదుర్గమ్మ తల్లి ఆలయం నేడు శిథిలావస్థలో ఉండటం భక్తుల మనసులను కలచివేస్తోంది. ఎన్నో ఏళ్లుగా భక్తుల పూజలు, మొక్కులు, హారతులతో నిత్యం కళకళలాడిన ఈ ఆలయం ఇప్పుడు శిథిలావస్థకు చేరుకోవడంతో స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చినా కనకదుర్గమ్మ ఆలయానికి మాత్రం కొత్త రూపు రాలేదని భక్తులు వాపోతున్నారు. ఆలయ ప్రాంగణం, పరిసరాలు అధ్వాన్నంగా మారడంతో, ముఖ్యంగా వర్షాకాలంలో గుడి వద్దకు చేరుకోవడమే భక్తులకు పెద్ద పరీక్షగా మారింది. వర్షం పడితే అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొనడంతో చిన్నారులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ప్రతి ఏడాది ఆషాఢ మాసం రాగానే ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు, మొక్కులు, హారతులు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. సకాలంలో వర్షాలు కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని, గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని భక్తులు వేడుకుంటారు. అలాంటి పవిత్ర ఆలయం నేడు శిథిలావస్థలో ఉండటం తమను బాధిస్తోందని వారు చెబుతున్నారు.

“అమ్మవారి ఆలయం బాగుంటే గ్రామానికే శోభ. ఆలయాన్ని అభివృద్ధి చేస్తే భక్తుల రాకపోకలు పెరుగుతాయి. గ్రామ ఆధ్యాత్మిక వైభవం మరింత వెలుగొందుతుంది” అని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఆలయ పునర్నిర్మాణానికి ప్రభుత్వం, దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని, అవసరమైన నిధులు మంజూరు చేసి ఆలయాన్ని పూర్వ వైభవంతో తీర్చిదిద్దాలని వారు కోరుతున్నారు.

కనకదుర్గమ్మ తల్లిపై గ్రామ ప్రజలకు ఉన్న భక్తి, విశ్వాసానికి తగిన గౌరవం కల్పించేలా ఆలయ పునర్నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభించాలని భక్తులు వేడుకుంటున్నారు. “అమ్మవారి ఆలయం మళ్లీ పూర్వ వైభవంతో కళకళలాడాలి.. గ్రామానికి ఆధ్యాత్మిక కాంతి తిరిగి రావాలి” అన్నదే ప్రతి భక్తుడి మనసులోని కోరికగా మారింది.