ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్రవ్యాప్తంగా ఉధృతగా ఉద్యమం

  • వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్
  • వైసిపి యువజన, వైద్య విభాగం ఆధ్వర్యంలో నిరసన

విజయవాడ, ఆంధ్రప్రభ : డీఎస్సీ నియామకాలలో అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాలలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు, నిరుద్యోగ భృతి, యువతకు ఉపాధి కల్పన తదితర డిమాండ్లతో వైసీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. సాంబమూర్తి రోడ్డులోని విజయ్ టాకీస్ వంతెన నుంచి ధర్నా చౌక్ వరకు జరిగిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు.

ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన సభలో దేవినేని అవినాష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువత పూర్తిగా నష్టపోయిందని ఆరోపించారు. యువగళం పాదయాత్రలో యువతకు ఇచ్చిన హామీలను మంత్రి నారా లోకేష్ పూర్తిగా విస్మరించారని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ సక్రమంగా అమలు కావడం లేదని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, నిరుద్యోగ భృతి హామీ కూడా అమలు కాలేదని పేర్కొన్నారు. డీఎస్సీ నియామకాలపై వస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక మంత్రి లోకేష్ అనవసర సవాళ్లు విసురుతున్నారని విమర్శించారు.

ముందు యువత, విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, ఆ తర్వాత రాజకీయ సవాళ్ల గురించి మాట్లాడాలని సూచించారు. వాస్తవాలు మాట్లాడే ధైర్యం మంత్రి లోకేష్‌కు లేదని ఆరోపించారు. జెన్-జీ యువత ప్రభుత్వ వైఫల్యాలను గమనిస్తోందని, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే తగిన గుణపాఠం చెబుతుందని దేవినేని అవినాష్ అన్నారు. విద్యార్థులు, యువత హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, డీఎస్సీ నియామకాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, ఫేక్ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల ఆధారంగా అనర్హులకు డీఎస్సీ ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు.

అర్హత సాధించిన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఈ వ్యవహారంపై నిష్పక్షపాత విచారణ జరిపి ప్రజలకు నిజాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. కోర్టు ఆదేశాలను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని ఆరోపించారు. డీఎస్సీ నియామకాలలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాల కారణంగానే హైకోర్టు విచారణకు స్వీకరించిందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆధారాలతో ప్రశ్నలు లేవనెత్తుతుంటే, ప్రభుత్వం వాటికి సమాధానం చెప్పకుండా దారి మళ్లించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ రూహుల్లా, మొండితోక జగన్‌మోహన్‌రావు, జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్‌చార్జి తన్నేరు నాగేశ్వరరావు, స్వామిదాస్, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కొరివి చైతన్య, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు కోమల్ సాయి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.