ప్రత్యామ్నాయ పంటల సాగుతో అధిక దిగుబడి సాధించాలి
నల్లగొండ రూరల్, ఆంధ్రప్రభ: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున రైతులు వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి ఉల్లోజు వినోద్‌కుమార్, మండల ప్రత్యేకాధికారి (పశుసంవర్ధక శాఖ జేడీ) రమేష్‌కుమార్ సూచించారు. సోమవారం నల్లగొండ మండలం వెలుగుపల్లి రైతు వేదికలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యామ్నాయ పంటల విత్తన మేళాను ప్రారంభించారు. భూగర్భ జలాలు తగ్గుతున్న నేపథ్యంలో కంది, పెసర, మినుము, ఆముదం, కూరగాయల వంటి ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతులు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.
మూడు రోజులపాటు నిర్వహించే విత్తన మేళాలో నాణ్యమైన కంది, పెసర, మినుము, ఆముదం, వివిధ కూరగాయల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అవసరమైన విత్తనాలను పొందాలని కోరారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సుంకోజు శ్రీనివాస్, ఎంపీడీవో యాకూబ్ నాయక్, ఉద్యానవన శాఖ అధికారి అనంతరెడ్డి, సర్పంచులు, ఏఈవోలు, రైతులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
