తెలంగాణను తడిపేస్తున్న వానలు.. హైదరాబాద్‌కు ఆరెంజ్ అలెర్ట్
రాష్ట్రవ్యాప్తంగా విస్తార వర్షాలు.. మరో రెండు రోజులు ఇదే జోరు
ఉదయం నుంచే జల్లులు.. స్కూళ్లు, కార్యాలయాలకు వెళ్లేవారికి ఇబ్బందులు
హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అనుకూల వాతావరణ పరిస్థితులు, అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. రానున్న మరో రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది.
రాజధాని హైదరాబాద్‌లో సోమవారం తెల్లవారుజాము నుంచే వర్షం ప్రారంభమైంది. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, కూకట్‌పల్లి, మియాపూర్, గచ్చిబౌలి, మాధాపూర్, బేగంపేట్, సికింద్రాబాద్, ఎల్బీనగర్, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఉదయం వేళ వర్షం కారణంగా కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధాన రహదారులపై వాహనాల రద్దీ పెరగడంతో పలు జంక్షన్లలో ట్రాఫిక్ నెమ్మదిగా సాగింది. ద్విచక్రవాహనదారులు, పాదచారులు వర్షంలో ఇబ్బందులు పడగా, కొన్ని లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
హైదరాబాద్ నగరానికి భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, చెట్ల కింద, బలహీనమైన నిర్మాణాల సమీపంలో ఆశ్రయం తీసుకోవద్దని హెచ్చరించింది.
మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ), విపత్తు నిర్వహణ విభాగం, ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాలు, నీరు నిలిచే ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను మోహరించి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వర్షపు నీరు వేగంగా తొలగించేందుకు సిబ్బందిని రంగంలోకి దించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు అధికారుల సహాయాన్ని పొందాలని సూచించారు.
ఇదిలా ఉండగా, రాష్ట్రంలోని ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాలతో పాటు దక్షిణ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా రానున్న రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రైతులు, ప్రజలు వాతావరణ సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
