అవినీతిపై ఏసీబీ ఫోకస్.. నాలుగు శాఖల అధికారులపై నిఘా

అవినీతిపై ఏసీబీ ఫోకస్.. నాలుగు శాఖల అధికారులపై నిఘా

100 మంది అధికారుల ఆస్తులు, లావాదేవీలపై సమాచారం సేకరణ

పక్కా ఆధారాల తర్వాతే దాడులు.. అవినీతిపై కఠిన చర్యలకు సన్నాహాలు

హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో అవినీతిపై ప్రభుత్వం కఠినవైఖరి అవలంబిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రజలతో నిత్యం సంబంధం ఉండే శాఖల్లో అవినీతి ఎక్కువగా ఉందనే ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆయా శాఖల అధికారులపై దృష్టి కేంద్రీకరించింది. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్‌కు వచ్చిన ఫిర్యాదులు, ఇంటెలిజెన్స్, విజిలెన్స్ విభాగాల నుంచి అందిన సమాచారం ఆధారంగా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన 100 మంది అధికారులపై నిఘా కొనసాగుతోంది.

100 మంది అధికారుల ఆస్తులు, లావాదేవీలపై సమాచారం సేకరణ

ఇప్పటికే 65 మంది అధికారులపై ప్రాథమిక స్థాయిలో సమాచారం సేకరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఏసీబీ దృష్టిలో అత్యధికంగా రెవెన్యూ, పోలీస్, జీహెచ్‌ఎంసీ, ఆర్టీఏ, విద్యుత్ శాఖలకు చెందిన అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ శాఖలు ప్రజలకు నేరుగా సేవలు అందించే విభాగాలు కావడంతో లంచాలు, అక్రమ లావాదేవీలకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గతంలో వచ్చిన ఆరోపణలు సూచించాయి.

కేవలం ఫిర్యాదుల ఆధారంగా కాకుండా గత ఆరు నెలలుగా అనుమానిత అధికారుల ఆర్థిక లావాదేవీలు, స్థిరాస్తులు, బ్యాంకు ఖాతాలు, కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న ఆస్తులు, బినామీ లావాదేవీలు వంటి అంశాలపై ఏసీబీ నిఘా పెట్టినట్లు సమాచారం. దీని కోసం వీడియో రికార్డింగ్‌లు, డాక్యుమెంటరీ ఆధారాలు, రిజిస్ట్రేషన్ వివరాలు, బ్యాంకింగ్ లావాదేవీలు వంటి సాక్ష్యాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. పక్కా ఆధారాలు లభించిన తర్వాతే దాడులు, కేసులు నమోదు చేసే విధానాన్ని ఏసీబీ అనుసరిస్తోంది.

పక్కా ఆధారాల తర్వాతే దాడులు.. అవినీతిపై కఠిన చర్యలకు సన్నాహాలు

ఇటీవలి కాలంలో ఆదాయానికి మించిన ఆస్తులు కేసుల్లో పలువురు ప్రభుత్వ అధికారులపై కేసులు నమోదు చేసిన ఏసీబీ ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సమాచారం. ఈ చర్యలు మిగతా అధికారుల్లోనూ ఆందోళన కలిగిస్తున్నాయి.

అవినీతిని ఏ మాత్రం ఉపేక్షించబోమని ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీకి స్వేచ్ఛ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. శిక్షలు కఠినంగా ఉంటేనే మిగతా అధికారులకు హెచ్చరికగా నిలుస్తాయని ప్రభుత్వ పెద్దలు కూడా అభిప్రాయపడినట్లు సమాచారం.

ముందున్న సవాళ్లు!

అవినీతిని అరికట్టడంలో ప్రజల భాగస్వామ్యం కూడా అత్యంత ముఖ్యమైనది. లంచం డిమాండ్ చేసిన అధికారులు లేదా అక్రమాస్తులపై విశ్వసనీయ సమాచారం ఉంటే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ లేదా ఇతర అధికారిక మార్గాల ద్వారా ఫిర్యాదు చేయాలని అధికారులు తరచూ సూచిస్తున్నారు.

అవినీతి కేసుల్లో దాడులు నిర్వహించడం ఒక దశ మాత్రమే. అనంతరం ఆస్తుల మూలాలను నిరూపించడం, కోర్టులో బలమైన సాక్ష్యాలను సమర్పించడం, చివరకు శిక్షలు పడేలా చేయడం మరింత కీలకమైన ప్రక్రియ. గతంలో కొన్ని కేసులు సాక్ష్యాల లేమితో బలహీనపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఈసారి పక్కా ఆధారాలతోనే ముందుకు వెళ్లాలని ఏసీబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.