గడ్చిరోలి పోస్టర్లతో కలకలం.. సరిహద్దుల్లో పెరిగిన అప్రమత్తత
గడ్చిరోలి పోస్టర్లతో కలకలం.. సరిహద్దుల్లో పెరిగిన అప్రమత్తత
బంద్ పిలుపుతో నిఘా సంస్థల అప్రమత్తం.. సరిహద్దు అడవుల్లో కూంబింగ్‌కు సిద్ధం
ఎస్ఐబీ, గ్రేహౌండ్స్ పాత్రపై చర్చ.. భద్రతా చర్యలు ముమ్మరం
హైదరాబాద్, చర్ల, ఆంధ్రప్రభ : కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు మరోసారి కలకలం రేపుతున్నాయి. భామ్రాగఢ్ తాలూకా పరిధిలోని పలు ప్రధాన రహదారులు, ప్రభుత్వ భవనాల వద్ద ఉత్తర గడ్చిరోలి డివిజన్ కమిటీ పేరుతో పోస్టర్లు వెలిశాయి. దీంతో భామ్రాగఢ్, ఏటపల్లి, అహేరి ప్రాంతాల్లో భద్రతా బలగాల గాలింపు మొదలైంది.
మావోయిస్టుల పోస్టర్లలో ఆదివాసీల జల్, జంగిల్, జమీన్ హక్కుల పరిరక్షణతో పాటు స్థానిక సమస్యలపై నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను వ్యతిరేకిస్తూ అత్యవసర సేవలు మినహా రవాణా, వ్యాపార సంస్థలను మూసివేసి ఈ నెల 30 వరకు జిల్లా వ్యాప్తంగా బంద్ పాటించాలని ప్రజలు, వ్యాపారులకు పిలుపునిచ్చారు. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొంతకాలంగా మౌనంగా ఉన్నట్టుగా కనిపించిన మావోయిస్టులు మళ్లీ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నాలు ప్రారంభించారా..? అనే చర్చ భద్రతా వర్గాల్లో మొదలైంది.
బంద్ పిలుపుతో నిఘా సంస్థల అప్రమత్తం.. సరిహద్దు అడవుల్లో కూంబింగ్‌కు సిద్ధం
ఈ పరిణామాలు తెలంగాణ సరిహద్దు జిల్లాల్లోనూ అప్రమత్తతను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల గడ్చిరోలిలో మావోయిస్టుల పేరుతో బ్యానర్లు వెలిసిన ఘటన కలకలం రేపగా, ఆ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఇప్పుడు బంద్ పిలుపుతో కూడిన పోస్టర్లు బయటపడటంతో ఇది సాధారణ ప్రచారమా..? లేక మావోయిస్టుల కొత్త వ్యూహానికి సంకేతమా..? అనే కోణంలో నిఘా సంస్థలు విశ్లేషిస్తున్నట్లు సమాచారం.
గడ్చిరోలికి ఆనుకుని ఉన్న తెలంగాణలోని కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అటవీ ప్రాంతాలు అత్యంత సున్నితమైనవిగా పరిగణించబడుతున్నాయి. గతంలో ఇదే సరిహద్దు ప్రాంతాలను ఆశ్రయంగా మార్చుకున్న మావోయిస్టులు పలుమార్లు సంచరించిన దాఖలాలు ఉన్నాయి. దీంతో సరిహద్దు మార్గాలపై ప్రత్యేక నిఘా, అడవుల్లో విస్తృత కూంబింగ్ నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎస్ఐబీ, గ్రేహౌండ్స్ పాత్రపై చర్చ.. భద్రతా చర్యలు ముమ్మరం
ఒకప్పుడు మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారాన్ని సేకరించడంలో కీలక పాత్ర పోషించిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) వ్యవస్థను మళ్లీ పూర్తిస్థాయిలో రంగంలోకి దింపాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు భద్రతా వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. సాంకేతిక నిఘాతో పాటు క్షేత్రస్థాయి సమాచార సేకరణను మరింత బలోపేతం చేయాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు గ్రేహౌండ్స్, ప్రత్యేక పోలీసు బలగాలు, జిల్లా పోలీసు యంత్రాంగం పరస్పర సమన్వయంతో సరిహద్దు ప్రాంతాలపై నిఘా పెంచే అవకాశం ఉంది. అడవుల్లో డ్రోన్ల వినియోగం, చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశముందని భద్రతా వర్గాలు చెబుతున్నాయి.
గడ్చిరోలి బంద్ పిలుపు నేపథ్యంలో తెలంగాణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకునే దిశగా భద్రతా యంత్రాంగం అడుగులు వేస్తుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. సరిహద్దు అడవుల్లో మళ్లీ ఎర్ర నీడ కమ్ముకోకుండా ఉండేందుకు పోలీసులు, నిఘా సంస్థలు మరింత అప్రమత్తంగా వ్యవహరించే అవకాశం ఉంది.
