యూరియా పంపిణీ యాప్‌లో లోపాలు సరిదిద్దాలి: కొండపల్లి శ్రీధర్ రెడ్డి
ఖమ్మం బ్యూరో (ఆంధ్రప్రభ): రాష్ట్ర ప్రభుత్వం యూరియా పంపిణీలో పారదర్శకత కోసం ప్రవేశపెట్టిన యాప్ అమలులో ఉన్న లోపాలను వెంటనే సరిదిద్దాలని బీజేపీ కిసాన్ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాప్‌లోని సాంకేతిక, విధానపరమైన సమస్యల కారణంగా నిజమైన రైతులు యూరియా పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో రెవెన్యూ రికార్డుల్లో హక్కులు లేకపోయినా దశాబ్దాలుగా సాగు చేస్తున్న నాన్-ట్రైబల్ రైతులు, టైటిల్ వివాదాలు ఉన్న భూములు లేదా నిషేధిత జాబితాలో ఉన్న భూములను సాగు చేస్తున్న రైతులు యాప్‌లో నమోదు కాకపోవడంతో యూరియా అందడం లేదన్నారు. ప్రభుత్వం డిజిటల్లీ నాన్ సైన్డ్ (డీఎన్‌ఎస్) విధానంలో వ్యవసాయాధికారుల ధృవీకరణతో యూరియా పొందవచ్చని ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆ విధానం సమర్థవంతంగా అమలు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని డీఎన్‌ఎస్ విధానాన్ని క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా అమలు చేయాలని, వ్యవసాయాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. రెవెన్యూ రికార్డులకే పరిమితం కాకుండా వాస్తవంగా సాగు చేస్తున్న రైతులను గుర్తించి యూరియా అందించేలా ప్రత్యేక మార్గదర్శకాలు తీసుకురావాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా యూరియా పంపిణీ వ్యవస్థను తక్షణమే సవరించాలని, లేకపోతే ఖరీఫ్ సీజన్‌లో వేలాది మంది రైతులు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తుందని కొండపల్లి శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు.
