మన బియ్యానికి విదేశాల్లో భారీ డిమాండ్.. అమాంతంగా పెరిగిన బియ్యం ధరలు
మన బియ్యానికి విదేశాల్లో భారీ డిమాండ్.. అమాంతంగా పెరిగిన బియ్యం ధరలు
ఎగుమతుల జోరు.. మిల్లర్ల వద్ద తగ్గుతున్న నిల్వలు
ఎల్‌నినో, రబీ సాగు తగ్గుదల ప్రభావం.. వినియోగదారులపై అదనపు భారం
అమరావతి, ఆంధ్రప్రభ: మార్కెట్లో బియ్యం ధరలు భగ్గుమంటున్నాయి. ఎల్‌నినో ప్రభావం స్పష్టంగా బియ్యంపై కనిపిస్తోంది. కొద్ది రోజుల వ్యవధిలో క్వాలిటీ రైస్ కిలోకు రూ.10 మేర పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడే ధరలు ఇలా ఉంటే, ఎల్‌నినో ప్రభావంతో ఈసారి వరి సాగు తగ్గి దిగుబడి కూడా పడిపోతే రేట్లు మరింత పెరుగుతాయేమో అన్న భయం ప్రజల్లో నెలకొంది.
దీనికితోడు గత ఖరీఫ్‌లో పంటను ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడం వల్ల రైతుల వద్ద ధాన్యం నిల్వలు తగ్గాయి. దీంతో ధాన్యానికి డిమాండ్ పెరగడంతో బియ్యం ధరలు అమాంతంగా పెరిగాయి. దేశంలో 150 మిలియన్ టన్నులకుపైగా వరి ధాన్యం ఉత్పత్తి అవుతుండగా, అందులో ఆంధ్రప్రదేశ్ వాటా 10 లక్షల టన్నుల (1 మిలియన్ టన్నులు)కు పైగా ఉంది. రాష్ట్రం నుంచి బియ్యాన్ని ఎగుమతుల కోసం ఉత్పత్తి చేసి కేటాయిస్తున్నారు.
నాన్ బాస్మతికి భారీ డిమాండ్
ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రధానంగా బాస్మతియేతర బియ్యం (సోనా మసూరి, బీపీటీ, ఐఆర్-64) ఎక్కువగా ఎగుమతి అవుతోంది. ప్రతి ఏడాది సౌదీ అరేబియా, యూఏఈ, బెనిన్, ఇరాక్, ఇరాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలకు వేలాది టన్నుల బియ్యాన్ని పంపిస్తున్నారు. ఈ రవాణా ఎక్కువగా కాకినాడ, విశాఖపట్నం ఓడరేవుల నుంచి జరుగుతోంది.
సోనా మసూరి రకానికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. బీపీటీ-5204 కూడా ప్రసిద్ధి చెందిన రకం కాగా, ఐఆర్-64 బల్క్ డిమాండ్ కోసం ఎక్కువగా ఎగుమతి అవుతోంది.
ముంబయి వ్యాపారుల కొనుగోళ్లు పెరుగుదల
రాష్ట్రంలో 2025-26 ఖరీఫ్ సీజన్లో 37 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. రబీలో అది కేవలం 7 లక్షల ఎకరాలకే పరిమితమైంది. సాధారణంగా 17 లక్షల ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా, 10 లక్షల ఎకరాల్లో తగ్గిపోయింది.
రబీ సీజన్లో మార్కెట్‌కు రావాల్సిన ధాన్యం తగ్గిపోవడం కూడా బియ్యం ధరలు పెరగడానికి ఒక కారణంగా కనిపిస్తోంది. దీనికి తోడు ఈ ఏడాది విదేశాల నుంచి నాన్ బాస్మతి బియ్యానికి డిమాండ్ పెరగడం మరో కారణం. ముంబయి వ్యాపారులు ఏపీ నుంచి పెద్దఎత్తున బియ్యం కొనుగోలు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
దీంతో మిల్లర్ల వద్ద నిల్వలు తగ్గిపోతున్నాయి. కొందరు కృత్రిమ కొరత సృష్టించి, నిల్వలను అధిక ధరలకు విక్రయిస్తూ లాభాలు పొందుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇథనాల్ ప్రభావం కూడా..
పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ తయారీకి బియ్యాన్ని వినియోగిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో పండించే తక్కువ రకం బియ్యాన్నే ఉపయోగిస్తున్నప్పటికీ, దేశీయ మార్కెట్లో ఏర్పడిన కొరత కారణంగా ఏపీ బియ్యానికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఇతర రాష్ట్రాల వ్యాపారులు కూడా మన బియ్యాన్ని కొనుగోలు చేయడంతో రాష్ట్రంలో ధరలు పెరగడానికి ఇది కూడా ఒక కారణంగా మారింది.
ఎల్‌నినో ప్రభావం వరి సాగుపై ఉంటుందనే హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి.
ఒక్కసారిగా పెరిగిన ధరలు
బియ్యం ధరలు రెండు నెలల క్రితంతో పోలిస్తే కిలోకు రూ.10కు పైగా పెరిగాయి. నాణ్యతను బట్టి 25 కిలోల బస్తాపై రూ.200 నుంచి రూ.300 వరకు వినియోగదారులపై అదనపు భారం పడుతోంది.
బీపీటీ రకం 25 కిలోల బస్తా రూ.1,500కు, హెచ్ఎంటీ రకం రూ.1,600కు చేరుకుంది. ధాన్యం లభ్యత తగ్గిపోవడంతో ధరలు పెరిగినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వం ఈ ఏడాది రైతులకు మంచి ధర ఇచ్చి ధాన్యం కొనుగోలు చేసింది. కృష్ణా డెల్టాలో ఎక్కువగా సాగు చేసే బీపీటీ రకాలన్నింటినీ కొనుగోలు చేసి పౌరసరఫరాల శాఖకు మళ్లించింది. ప్రభుత్వానికి విక్రయించిన తర్వాత మిగిలిన ధాన్యాన్ని రైతులు వ్యాపారులకు అమ్మడంతో మార్కెట్లో నిల్వలు తగ్గిన పరిస్థితి ఏర్పడింది.
