సహకార ఎన్నికల విజయంపై టీపీసీసీ చీఫ్ హర్షం
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇటీవల జరిగిన సహకార సంఘాల ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు ఘన విజయం సాధించడంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.
మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పిల్లలమర్రి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా సహకార సంఘాల ప్రతినిధులు మహేష్ కుమార్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల ఫలితాలను వివరించగా, జిల్లాలో అత్యధిక చైర్మన్, పాలకవర్గ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోవడం పట్ల ఆయన నాయకులు, కార్యకర్తలను అభినందించారు.
హ్యాట్రిక్ సాధించిన పిల్లలమర్రి శ్రీనివాస్
చౌటుప్పల్ మండలంలోని నేలపట్ల చేనేత సహకార సంఘం అధ్యక్షుడిగా వరుసగా మూడోసారి విజయం సాధించిన పిల్లలమర్రి శ్రీనివాస్‌ను టీపీసీసీ చీఫ్ శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ విజయం చేనేత కార్మికులకు కాంగ్రెస్‌పై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని కొనియాడారు.
ప్రభుత్వ విప్ వేముల వీరేశం అభినందనలు
అనంతరం ప్రతినిధుల బృందం ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసి ఎన్నికల విజయాన్ని వివరించింది. గెలుపొందిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన, చేనేత కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పిల్లలమర్రి శ్రీనివాస్‌ను శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో నేలపట్ల చేనేత సహకార సంఘం ఉపాధ్యక్షుడు కోడం రాములు, కార్యదర్శి గుర్రం శ్రీనివాస్, డైరెక్టర్ గుర్రం గోవర్ధన్, మాజీ కార్యదర్శి తడక వెంకటేశం, సంఘ సభ్యుడు అలీ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
