విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతి..
- రైతును ఆదుకోవాలని సర్పంచ్ వెంకటేశం డిమాండ్
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని మందోళ్లగూడెం గ్రామంలో సోమవారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నిరుపేద రైతు నెట్టు మల్లయ్యకు చెందిన సుమారు లక్ష రూపాయల విలువైన ఎద్దు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మరణించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మందోళ్లగూడెం గ్రామానికి చెందిన రైతు గూడూరు ప్రతాపరెడ్డి పామాయిల్ తోటలో ఒక మినీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఉంది.
ఆ సమీపంలో నెట్టు మల్లయ్యకు చెందిన ఎద్దు గడ్డి మేస్తుండగా ట్రాన్స్‌ఫార్మర్ వద్ద భూమికి దగ్గరగా ఉన్న విద్యుత్ తీగలు ప్రమాదవశాత్తు ఎద్దుకు తగిలాయి. దీంతో తీవ్రమైన విద్యుత్ షాక్‌కు గురై ఆ మూగజీవం అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కంటికి రెప్పలా కాపాడుకుంటూ, వ్యవసాయానికి ఆధారంగా ఉన్న ఎద్దు మరణించడంతో బాధిత రైతు కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ తంగెళ్ల వెంకటేశం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ ప్రమాదంలో ఎద్దు మరణించి నష్టపోయిన నిరుపేద రైతు మల్లయ్యను ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి తగిన నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
