15 నిమిషాల్లో బాలిక ఆచూకీ..
పెనుమూరు పోలీసుల చాకచక్యం
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ : స్కూల్కు వెళ్లకుండా హోటల్ సమీపంలో ఒంటరిగా కూర్చున్న 13 ఏళ్ల విద్యార్థినిని పెనుమూరు పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో కేవలం 15 నిమిషాల్లో గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ తుషార్ డూడి పోలీసు బృందాన్ని అభినందించారు.
పెనుమూరు మండలం చార్వగానిపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని సోమవారం ఉదయం స్కూల్ బస్సు తప్పిపోవడంతో ఆమె పిన్ని ఓ గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్ర వాహనంపై పెనుమూరుకు పంపించారు. అయితే స్కూల్కు ఆలస్యంగా వెళితే ఉపాధ్యాయులు మందలిస్తారనే, ఇంటికి వెళితే తల్లిదండ్రులు కోప్పడతారనే భయంతో బాలిక పెనుమూరులోని రెడ్డెమ్మ హోటల్ సమీపంలో ఒంటరిగా కూర్చుంది.
ఉదయం 10.30 గంటలకు విద్యార్థిని స్కూల్కు రాకపోవడంతో యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం అందించింది. వెంటనే వారు ఉదయం 10.45 గంటలకు పెనుమూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
వెంటనే స్పందించిన ఎస్ఐ శ్రీనివాసులు, పోలీసు సిబ్బంది పరిసర ప్రాంతాల సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఉదయం 11 గంటలకు బాలికను గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ, చిన్నారుల భద్రత పోలీసు శాఖకు అత్యంత ప్రాధాన్యమని, పిల్లలకు సంబంధించిన ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించడం తమ బాధ్యత అని తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా కనిపించని వ్యక్తులను వేగంగా గుర్తించడం సాధ్యమవుతోందని చెప్పారు.
తల్లిదండ్రులు పిల్లలను గుర్తు తెలియని వ్యక్తులతో పంపవద్దని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. అలాగే పట్టణాలు, గ్రామాలు, విద్యాసంస్థలు, ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు సహకరించాలని జిల్లా పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది.
