మంచానికే పరిమితమైన దివ్యాంగుడికి గూడు కావాలి..
కలెక్టర్‌ను ఆశ్రయించిన తల్లి
బాపట్ల, ఆంధ్రప్రభ : కర్లపాలెం మండలం గణపవరం గ్రామానికి చెందిన పుట్టుకతోనే దివ్యాంగుడైన తన కుమారుడు కప్పల యశ్వంత్ కుమార్ రెడ్డికి ఇంటి స్థలం మంజూరు చేసి గృహాన్ని నిర్మించి ఇవ్వాలని ఆయన తల్లి కప్పల వెంకట పద్మజ సోమవారం బాపట్ల జిల్లా కలెక్టర్ డా. వినోద్ కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
తన కుమారుడి వైద్య చికిత్స కోసం కుటుంబ ఆస్తులన్నింటినీ విక్రయించినప్పటికీ వైకల్యం తగ్గలేదని, ప్రస్తుతం రూ.6 వేల దివ్యాంగ పింఛన్ మాత్రమే అందుతోందని ఆమె తెలిపారు. మంచానికే పరిమితమైన తన కుమారుడికి ప్రభుత్వం అందించే రూ.15 వేల పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే వేలిముద్ర నమోదు కావడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
నివాసానికి సొంత ఇల్లు లేకపోవడంతో గత ప్రభుత్వ హయాంలో స్మశానవాటిక సమీపంలో ఇంటి స్థలం కేటాయించారని, దానిని రద్దు చేసి నివాసయోగ్యమైన ప్రాంతంలో స్థలం కేటాయించాలని ఆమె కోరారు.
ఈ సమస్యపై గతంలో మంగళగిరి ప్రజావాణిలో అర్జీ సమర్పించగా, సంబంధిత అధికారులు ఇంటి స్థలం మంజూరు చేసి గృహ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, కర్లపాలెం వీఆర్వో, తహసీల్దార్ వాటిని అమలు చేయడం లేదని ఆమె ఆరోపించారు.
దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ డా. వినోద్ కుమార్ వెంటనే ఆర్డీవో హరికుమార్కు ఫోన్ చేసి, అర్జీదారుల సమస్యను అత్యవసరంగా పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. మంచానికే పరిమితమైన దివ్యాంగుడిని కలెక్టరేట్ వరకు తీసుకురావడం ద్వారా ఇబ్బందులకు గురిచేయవద్దని తల్లికి సూచించారు.
అనంతరం ఆర్డీవో హరికుమార్ అర్జీదారులను కలిసి పూర్తి వివరాలు తెలుసుకుని, గ్రామాన్ని స్వయంగా సందర్శించి వీలైనంత త్వరగా సమస్యకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.
