సరిహద్దుల్లో ఇక తిరుగుండదంతే!

ఆంధ్ర‌ప్ర‌భ‌, హైదరాబాద్ : భారతదేశ రక్షణ రంగ (డిఫెన్స్) పటంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ అత్యంత కీలకమైన వ్యూహాత్మక హబ్‌గా అవతరిస్తోంది. ఐటీ, ఫార్మా రంగాల్లోనే కాకుండా.. ‘ఆత్మనిర్భర్ భారత్’ సాధనలో భాగంగా స్వదేశీ రక్షణ పరికరాల తయారీలోనూ భాగ్యనగరం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోంది.

ఈ క్రమంలోనే, హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ రక్షణ సంస్థ ‘ద్వీప డిఫెన్స్’ (Dvipa Defence) ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన ‘ఉగ్రం’ (7.62×51 మి.మీ.) బ్యాటిల్ రైఫిల్ సరికొత్త రికార్డులు సృష్టిస్తూ భారత రక్షణ దళాల కొనుగోలు ప్రక్రియకు సిద్ధమైంది.

‘ఉగ్రం’ ప్రత్యేకతలు ఇవే..

పూర్తి గ్యాస్-ఆపరేటెడ్ రొటేటింగ్ బోల్ట్ వ్యవస్థతో ఇది పనిచేస్తుంది. సైనికుల సౌకర్యం కోసం దీని బరువును 4 కిలోల కంటే తక్కువగానే ఉంచడం విశేషం. దీని ఎఫెక్టివ్ ఫైరింగ్ రేంజ్ 500 మీటర్లుగా నిర్ధారించారు. కఠినమైన పర్వత ప్రాంతాలు, మంచు తుఫానులు, తీవ్రమైన ఉష్ణోగ్రతల్లో (Extreme Climates) సైతం ఇది నిరాటంకంగా పనిచేస్తుంది.

డీఆర్డీవో భాగస్వామ్యం.. 100 రోజుల్లోనే రికార్డు..

రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO)కు చెందిన ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ARDE) సాంకేతిక భాగస్వామ్యంతో ద్వీప డిఫెన్స్ ఈ ‘ఉగ్రం’ రైఫిల్‌ను రూపొందించింది. కేవలం 100 రోజుల రికార్డు కాలంలోనే ఈ స్వదేశీ బ్యాటిల్ రైఫిల్‌ను డిజైన్ చేసి, ప్రోటోటైప్ సిద్ధం చేయడం దేశీయ రక్షణ రంగంలోనే ఒక విప్లవాత్మక పరిణామంగా నిలిచింది.

భారత సైన్యానికి చెందిన అత్యంత కఠినమైన ఆర్మీ జనరల్ స్టాఫ్ క్వాలిటేటివ్ రిక్వైర్‌మెంట్ (GSQR) పరీక్షలను ‘ఉగ్రం’ విజయవంతంగా పూర్తి చేసుకుంది. వివిధ క్లిష్టమైన వాతావరణ పరిస్థితులలో నిర్వహించిన క్షేత్రస్థాయి (Field Evaluation) ట్రయల్స్‌ను ఇది సమర్థవంతంగా అధిగమించింది.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సంబంధించిన బోర్డు ట్రయల్స్ సైతం పూర్తి కావడంతో.. సీఆర్పీఎఫ్ (CRPF), ఐటీబీపీ (ITBP), ఎస్ఎస్‌బీ (SSB), ఎన్ఎస్‌జీ (NSG) వంటి ప్రధాన కేంద్ర సాయుధ పోలీసు దళాల కొనుగోలు ప్రక్రియ చివరి దశకు చేరుకుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

గ్లోబల్ డిఫెన్స్ మ్యాప్‌లో హైదరాబాద్ బ్రాండ్

2018లో హైదరాబాద్‌లో ఏర్పాటైన ద్వీప డిఫెన్స్ కేవలం ‘ఉగ్రం’ రైఫిల్‌కే పరిమితం కాలేదు. యూ-19 సబ్‌మెషిన్ గన్, అత్యంత తేలికపాటి మెషిన్ గన్ (Ultra Light Machine Gun), యూ-45 అసాల్ట్ రైఫిల్, యూ-39 ప్లాట్‌ఫామ్, అలాగే ఉగ్రం రైఫిల్ ఆధారిత యాంటీ-డ్రోన్ ఆయుధ వ్యవస్థలను సైతం హైదరాబాద్‌లోనే తయారు చేస్తోంది. అత్యంత సంక్లిష్టమైన ఆయుధ పరిజ్ఞానంతో ‘మేడ్ ఇన్ హైదరాబాద్’ బ్రాండ్ నేడు గ్లోబల్ డిఫెన్స్ తయారీ మ్యాప్‌లో అత్యంత బలమైన ముద్ర వేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యానికి (PPP) ఈ విజయం ఒక రోల్ మోడల్‌గా నిలవనుంది.