Kaleshwaram Project | మాపై కోసం ఉంటే కేసులు పెట్టుకో…

రైతులపై పగ తీర్చుకోవద్దు..

Kaleshwaram Project |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టు, గోదావరి జలాల వినియోగంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమపై రాజకీయంగా కోపం ఉంటే కేసులు పెట్టుకోవచ్చని, కానీ రైతులపై పగ తీర్చుకోవద్దని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో వర్షాలు సరిగా లేకపోయినా కన్నెపల్లి పంప్‌హౌస్ సమీపంలో లక్ష క్యూసెక్కుల మేర గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయని కేటీఆర్ అన్నారు. కరువు పరిస్థితులు ఉన్నా, గోదావరిలో ఏడాది పొడవునా నీరు లభించే ప్రాంతాన్ని గుర్తించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని పేర్కొన్నారు.

కన్నెపల్లి పంప్‌హౌస్‌లో కేవలం రెండు పంపులు ప్రారంభిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని విస్తారమైన వ్యవసాయ భూములకు సాగునీరు అందుతుందని, అయితే ప్రభుత్వం పంపులను ప్రారంభించకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.

కేసీఆర్ హయాంలో రైతుల కోసం హమాలీలు వడ్ల బస్తాలు మోసి కష్టపడేవారని, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి రైతుల ప్రయోజనాల కంటే ఇతర అంశాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం ప్రాజెక్టు పంపులను వెంటనే ప్రారంభించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.