Weather Telangana | తగ్గిన అల్పపీడన ప్రభావం
ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
హైదరాబాద్‌తో పాటు మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం
Weather Telangana | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం బలహీనపడటంతో తెలంగాణలో భారీ వర్షాలకు తాత్కాలికంగా విరామం లభించింది. దీంతో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా విస్తార వర్షాల కంటే చెదురుమదురు వర్షాలే కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, సిద్ధిపేట, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో హైదరాబాద్‌తో పాటు మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ స్వల్ప జల్లులు లేదా చిరు వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మేఘావృత వాతావరణం కొనసాగడంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం కూడా ఉంది.
వర్షాలు కురిసే ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో నిల్చోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
