Tirumala | 116 ఏళ్ల వృద్ధ భక్తురాలికి శ్రీవారి దివ్యదర్శనం

నవనీతమ్మ జీవితకాల కోరికను నెరవేర్చిన టీటీడీ..
కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విఐపీ బ్రేక్ దర్శనం
వేదాశీర్వచనం, పట్టువస్త్రం, తీర్థప్రసాదాలతో ఘన సత్కారం..
ఈఓ ముద్దాడ రవిచంద్ర ఆశీర్వాదం పొందారు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : శ్రీవారి దర్శనం చేయాలన్న 116 ఏళ్ల వృద్ధ భక్తురాలు శ్రీమతి నవనీతమ్మ జీవితకాల కోరికను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నెరవేర్చింది. సోమవారం ఆమెకు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి ప్రత్యేక విఐపీ బ్రేక్ దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పించారు.దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర ఆధ్వర్యంలో నవనీతమ్మకు ప్రత్యేక సత్కారం నిర్వహించారు. వేదపండితులతో వేదాశీర్వచనం చేయించి, పట్టువస్త్రం కప్పి, శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఈఓ నవనీతమ్మకు నమస్కరించి ఆమె ఆశీర్వాదాన్ని స్వీకరించారు.

ఈ సందర్భంగా నవనీతమ్మ మనవడు దిక్పతి మాట్లాడుతూ, తమ అమ్మమ్మ చిరకాల కోరికను నెరవేర్చడంతో పాటు కుటుంబ సభ్యులందరికీ శ్రీవారి దర్శన భాగ్యం కల్పించిన టీటీడీ యాజమాన్యానికి, టీటీడీ చైర్మన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నవనీతమ్మను గుర్తించడంలో సహకరించిన సామాజిక మాధ్యమాల వినియోగదారులకు, వెంటనే స్పందించి అవసరమైన ఏర్పాట్లు చేసిన టీటీడీ విజిలెన్స్ అధికారులకు కూడా అభినందనలు వ్యక్తమయ్యాయి.