మొబైల్ చార్జర్ పేలడంతో ఇంట్లో అగ్నిప్రమాదం..
తవణంపల్లి, ఆంధ్రప్రభ : చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని తవణంపల్లి మండలం ఎగువ తడకర ఈ. వెంకటాపురం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున మొబైల్ చార్జర్ పేలడంతో ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది.
గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దివంగత సుబ్రహ్మణ్యం శెట్టి ఇంట్లో ఉదయం సుమారు 5 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బెడ్రూమ్లో మొబైల్ చార్జర్ పేలడంతో మంటలు చెలరేగి ఇంట్లో ఉన్న రూ.90 వేల నగదు, పట్టు వస్త్రాలు, వీధిలైట్లు, రెండు టెలివిజన్లు, పై అంతస్తులో ఉన్న ఎలక్ట్రికల్, ప్లంబింగ్ సామగ్రి సహా సుమారు రూ.2.50 లక్షల విలువైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి.
ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మంటలను వెంటనే గుర్తించలేకపోయారు. స్థానికులు పొగలు గమనించి ఇంటి తాళాలు పగులగొట్టి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం, అధికారులు తమను ఆదుకోవాలని కోరారు. సమాచారం అందుకున్న రెవెన్యూ శాఖ అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. వీఆర్వో ప్రకాష్ నష్టం వివరాలను నమోదు చేసి, ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని తెలిపారు.
