దేవాలయాల అభివృద్ధితోనే ధర్మం, సంస్కృతి పరిరక్షణ: ఎమ్మెల్యే రాము

వేమవరం కొండలమ్మ ఆలయంలో దాతల సహకారంతో నిర్మించిన దుకాణాల కాంప్లెక్స్ ప్రారంభం

కొండలమ్మ ఆలయాన్ని రాష్ట్ర స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ

గుడ్లవల్లేరు, ఆంధ్రప్రభ: దేవాలయాల అభివృద్ధి ద్వారానే ధర్మం, సంస్కృతి పరిరక్షించబడుతుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఆలయాల ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

గుడ్లవల్లేరు మండలం వేమవరంలోని ప్రసిద్ధ శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో దాతల సహకారంతో నిర్మించిన ఎనిమిది దుకాణాల కాంప్లెక్స్‌ను శనివారం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రారంభించారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించి, ధర్మకర్తల కమిటీ సభ్యులు, దాతలు, భక్తులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు.

కార్యక్రమానికి చేరుకున్న ఎమ్మెల్యేకు దేవాదాయ శాఖ అధికారులు మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంప్లెక్స్ నిర్మాణానికి సహకరించిన దాతలను శాలువాలతో సత్కరించి అభినందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దాతల సహకారంతో కొండలమ్మ ఆలయం మరింత అభివృద్ధి చెందుతోందన్నారు. కొత్త దుకాణాల కాంప్లెక్స్ ద్వారా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని చెప్పారు. ఆలయ ఆదాయం పెరగడంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని, కొండలమ్మ ఆలయాన్ని రాష్ట్ర స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హామీ ఇచ్చారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న ధర్మకర్తలు, దాతలు, భక్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తల కమిటీ చైర్మన్ ఈడే మోహన్, ఈవో ఆకుల కొండలరావు, మండల టీడీపీ అధ్యక్షుడు పోలవరపు వెంకటరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ పొట్లూరి రవి, కార్పొరేషన్ డైరెక్టర్ సాయన పుష్పవతి, కౌతవరం బ్యాంక్ చైర్మన్ యుగంధర్, గుడ్లవల్లేరు బ్యాంక్ అధ్యక్షుడు వెనిగళ్ల నాగేశ్వరరావు, టీడీపీ, జనసేన నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, దాతలు పాల్గొన్నారు.