మహిళా సంఘాలకు ఎస్‌ఐఆర్‌పై అవగాహన
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: భీమ్‌గల్ మండలంలోని మెండోరా గ్రామంలో మహిళా సంఘాల సభ్యులకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కుంట లక్ష్మీ రమేష్ మాట్లాడుతూ, ఓటర్లు ఎస్‌ఐఆర్ దరఖాస్తు ఫారాన్ని సరైన విధంగా నింపాలని సూచించారు. ఫారంలోని మొదటి కాలమ్‌లో 2002 నాటికి ఓటరుగా నమోదై అప్పటి ఓటరు జాబితాలో పేరు ఉన్నవారు ఆ వివరాలను నమోదు చేయాలని తెలిపారు. 2002లో ఓటరుగా నమోదు కాని వారు ఆ కాలమ్‌ను ఖాళీగా ఉంచాలని చెప్పారు.
కుడివైపు ఉన్న కాలమ్‌లో 2002లో ఓటరుగా లేని వారు తమ తల్లి, తండ్రి, తాత లేదా నానమ్మ వివరాలను నమోదు చేయాలని, మూడో కాలమ్‌లో ప్రస్తుతం తమ వ్యక్తిగత వివరాలను పూర్తిగా నమోదు చేయాలని వివరించారు.
ఓటు ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని, ఆ హక్కును పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా ఉండేందుకు బూత్ లెవల్ అధికారులకు సరైన వివరాలు అందించాలని మహిళలకు విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో మహిళలు ఎస్‌ఐఆర్ ఫారాల నింపడంపై తమ సందేహాలను నివృత్తి చేసుకోగా, అధికారులు అవసరమైన సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, గ్రామ సమాఖ్య వీవో సభ్యులు పుష్ప, శిరీష, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
