ప్రభుత్వ బడులపై పెరుగుతున్న నమ్మకం…

  • నర్సంపేటలో 856 మంది కొత్త అడ్మిషన్లు
  • మారుతున్న తల్లిదండ్రుల ఆలోచనకు అద్దం

నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ: ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాల అంటే నిరాసక్తత… ప్రైవేట్ పాఠశాల అంటేనే నాణ్యమైన విద్య అనే భావన బలంగా ఉండేది. అయితే కాలం మారుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతున్న మౌలిక వసతులు, నాణ్యమైన బోధన, ఆంగ్ల మాధ్యమ విద్య, డిజిటల్ తరగతి గదులు, ఉచిత సంక్షేమ పథకాలు తల్లిదండ్రుల ఆలోచనలో మార్పు తీసుకొస్తున్నాయి. నర్సంపేట మండలంలో జూలై 1 నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో 856 మంది కొత్త విద్యార్థులు చేరడం ఈ మార్పుకు స్పష్టమైన సంకేతంగా నిలిచింది. వీరిలో 495 మంది బాలురు, 361 మంది బాలికలు ఉన్నారు.

విద్యాశాఖ చేపట్టిన బడిబాట కార్యక్రమం ఫలిస్తుంది, ఉపాధ్యాయుల ఇంటింటి ప్రచారం, పాఠశాలలపై ప్రజల్లో అవగాహన పెంచడం వంటి చర్యలు సానుకూల ఫలితాలను ఇస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం, డిజిటల్ బోధన, క్రీడా సౌకర్యాలు తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి.

అత్యధిక చేరికలు నమోదు చేసిన పాఠశాలలు, మండలంలోని కొన్ని పాఠశాలలు విశేషంగా కొత్త అడ్మిషన్లను నమోదు చేశాయి. ఎంపీపీఎస్ హనుమాన్ దేవల్ (ఇంగ్లీష్ మీడియం)లో 158 మంది, పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్ (బాలికల) నర్సంపేటలో 93 మంది, జెడ్పీహెచ్‌ఎస్ బాయ్స్ నర్సంపేటలో 88 మంది, ఎంపీపీఎస్ నర్సంపేటలో 40 మంది, జెడ్పీహెచ్‌ఎస్ మోడల్ నర్సంపేటలో 34 మంది, ప్రభుత్వ ఉన్నత పాఠశాల నర్సంపేటలో 32 మంది కొత్తగా చేరడం విశేషం.

ప్రైవేట్ పాఠశాలలకు హెచ్చరికేనా?

ఇటీవలి కాలంలో ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు, బలవంతపు పుస్తకాల కొనుగోలు, అదనపు చార్జీలు, రవాణా వ్యయాలు వంటి అంశాలు తల్లిదండ్రులపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. దీనికి భిన్నంగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఉచిత సదుపాయాలు లభిస్తుండటంతో చాలామంది తల్లిదండ్రులు ప్రభుత్వ బడుల వైపు మొగ్గు చూపుతున్నారు.

ఇంకా పెరిగే అవకాశమే..

విద్యా సంవత్సరం ప్రారంభమై ఇంకా కొద్ది రోజులే కావడంతో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. రానున్న రోజుల్లో కొత్త చేరికలు మరింత పెరిగే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల విశ్వాసం బలపడుతున్న నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం గత సంవత్సరాల కంటే మెరుగైన అడ్మిషన్లు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

విద్యను వ్యాపారంగా కాక… సేవగా..

ప్రభుత్వం విద్యను ప్రతి చిన్నారికి హక్కుగా అందించాలనే లక్ష్యంతో కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తోంది. ఈ క్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే ప్రభుత్వ పాఠశాలలు విద్యా రంగంలో మరింత ముందుకు వెళ్లగలవు. నర్సంపేటలో నమోదైన 856 కొత్త అడ్మిషన్లు ఆ దిశగా ఆశాజనకమైన సంకేతంగా నిలుస్తున్నాయని విద్యాశాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.