బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్‌పై కేంద్ర దృష్టి సారించాలి
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌కు వినతి అందజేసిన పొంగులేటి సుధాకర్ రెడ్డి
ఖమ్మం బ్యూరో, ఆంధ్రప్రభ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తెలంగాణ పర్యటన సందర్భంగా సోమవారం వరంగల్‌లో నిర్వహించిన పార్టీ సమావేశం రాష్ట్ర నాయకత్వంలో నూతనోత్సాహాన్ని నింపింది. పార్టీ సంస్థాగత బలోపేతం, బూత్ కమిటీల విస్తరణ, ప్రజా సమస్యలపై ఉద్యమాలు, రానున్న ఎన్నికల వ్యూహాలపై జరిగిన కీలక సమావేశాల్లో భారతీయ జనతా పార్టీ జాతీయ సభ్యుడు, తమిళనాడు–కర్ణాటక రాష్ట్రాల సహ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి పాల్గొని జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ వ్యవహారాన్ని ఆయన జాతీయ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లి పూర్తి వివరాలను వివరించారు.
కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కింద సుమారు రూ.109.59 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఈ మెగా ఫుడ్ పార్క్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.49.79 కోట్ల గ్రాంట్ మంజూరు చేసిందని, రైతుల నుంచి సేకరించిన సుమారు 200 ఎకరాల భూమిపై వ్యవసాయ ఉత్పత్తుల విలువ ఆధారిత ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేయడం, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడం, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలని పొంగులేటి వివరించారు.
అయితే ప్రాజెక్టు అమలు, భూ కేటాయింపులు, కేంద్ర నిధుల వినియోగం, ప్రైవేటు సంస్థలకు అప్పగింపు ప్రక్రియలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని సమగ్ర దర్యాప్తు చేపట్టాలని, అవసరమైతే సంబంధిత కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ జరిపించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
పొంగులేటి సుధాకర్ రెడ్డి వినతిపై జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ సానుకూలంగా స్పందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, కేంద్ర నిధులు నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగానే వినియోగించబడేలా అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, జాతీయ ఓబీసీ అధ్యక్షుడు కోవా లక్ష్మణ్, అభయ్ పాటిల్, అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మహారాష్ట్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి ఆశిష్ షేలార్‌తో పాటు పార్టీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతంతో పాటు ప్రజా సమస్యలను జాతీయ స్థాయిలో ప్రస్తావించే దిశగా ఈ సమావేశం కీలకంగా నిలిచిందని పార్టీ నాయకులు పేర్కొన్నారు.
