మాదకద్రవ్యాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

ములుగు, ఆంధ్రప్రభ ప్రతినిధి: ములుగు జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సోమవారం జిల్లా పోలీస్ శాఖ, జిల్లా సంక్షేమ శాఖ సంయుక్తంగా నిర్వహించిన భారీ అవగాహన ర్యాలీని జిల్లా సంక్షేమ శాఖ అధికారి ప్రేమలతతో కలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు.

ములుగు జిల్లా కేంద్రంలోని బండారుపల్లి మూలమలుపు నుండి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును, కుటుంబాలను నాశనం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్, గంజాయి రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని, ఇందులో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని పిలుపునిచ్చారు. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు, ప్రజలు “డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేద్దాం” అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్‌బీ డీఎస్పీ కిషోర్ కుమార్, ములుగు డీఎస్పీ రవీందర్, సీఐలు దయాకర్, సురేష్, ఎస్సైలు, ఎక్సైజ్, సంక్షేమ శాఖ అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.