Farmer’s Assurance | వర్షాలతో మధిర సభ రద్దు.. హైదరాబాద్‌లో నిర్వహణ
Farmer’s Assurance | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా పంపిణీ సదస్సును ఈనెల 30న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించనుంది.
వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా మధిర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని రైతు ఆశీర్వాద సభగా నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అయితే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఆ సభను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచనల మేరకు శిల్పకళా వేదికలోనే రైతు భరోసా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఈనెల 30వ తేదీ సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా రైతులు, రైతు వేదికల ద్వారా వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులకు పెట్టుబడి సాయాన్ని అందజేయడంతో పాటు ప్రభుత్వ వ్యవసాయ సంక్షేమ కార్యక్రమాలపై కూడా ఈ సందర్భంగా వివరించనున్నారు.
