డల్లాస్‌లో ఎర్రబెల్లి పర్యటన..

  • డల్లాస్ లో టెక్ స్టార్ ఐ.టీ కంపెనీ సందర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి..
  • వరంగల్ వాసులకు డల్లాస్ లో ఉద్యోగాలు ఇవ్వడం అభినందనీయం..
  • మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : అమెరికాలోని డల్లాస్ నగరంలో వరంగల్‌కు చెందిన అశోక్, రఘు చిట్టీమల్ల స్థాపించిన టెక్ స్టార్ ఐటీ కంపెనీని వారి ఆహ్వానం మేరకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించారు.

ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులతో మాట్లాడిన ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా తెలంగాణ బిడ్డలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారని అన్నారు. అమెరికాలో పలు నగరాల్లో స్వంత భవనాల్లో కంపెనీ శాఖలను నిర్వహించడంతో పాటు హైదరాబాద్‌లో కూడా బ్రాంచులు ఏర్పాటు చేయడం తెలంగాణకే కాకుండా ముఖ్యంగా వరంగల్‌కు గర్వకారణమని పేర్కొన్నారు.

ఈ సంస్థలో సుమారు 1,500 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, వారిలో 500 మంది వరంగల్ జిల్లాకు చెందిన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. తెలంగాణ నుంచి వచ్చే ప్రతిభావంతులైన యువతకు భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించి వారికి అండగా నిలవాలని సంస్థ యాజమాన్యాన్ని కోరారు.

రాష్ట్రంలో రానున్న ప్రభుత్వం బీఆర్ఎస్‌దేనని, మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపడతారనే విశ్వాసం వ్యక్తం చేశారు. సంస్థ అభివృద్ధికి తమవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త అజయ్ కాల్వాల, పలు ఐటీ కంపెనీల సీఈఓలు తదితరులు పాల్గొన్నారు.