జియో సేవలపై వినూత్న నిరసన
జియో సేవలపై వినూత్న నిరసన
ఖానాపూర్ రూరల్, ఆంధ్రప్రభ : మండలంలోని సత్తనపల్లి గ్రామంలో జియో నెట్ వర్క్ వినియోగదారులు సోమవారం వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. గ్రామంలోని జియో సెల్ టవర్ వద్దకు చేరుకుని తమ మొబైల్ ఫోన్లను పైకి ఎత్తి సిగ్నల్ కోసం వేచి చూస్తున్నట్లు ప్రదర్శన నిర్వహించారు. గత మూడు నెలలుగా గ్రామంలో కరెంటు సరఫరా నిలిచిపోయిన ప్రతిసారి జియో నెట్ వర్క్ పూర్తిగా పని చేయడం లేదని, సిగ్నల్స్ అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర కాల్స్ చేయడం, ఆన్‌లైన్ సేవలు వినియోగించడం, డిజిటల్ లావాదేవీలు నిర్వహించడం కూడా కష్టంగా మారిందని తెలిపారు.
ఈ సమస్య పై ఇప్పటికే కస్టమర్ కేర్‌కు పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేసినప్పటికీ కంపెనీ నుంచి ఎలాంటి స్పందన లేదని ఆరోపించారు. ప్రతి నెలా రీఛార్జీల కోసం వేల రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ సరైన సేవలు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సమస్యను పరిష్కరించి, టవర్‌కు నిరంతర విద్యుత్ సరఫరా లేదా బ్యాకప్ వ్యవస్థను ఏర్పాటు చేసి నెట్‌వర్క్ సేవలను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. లేదంటే గ్రామంలోని జియో వినియోగదారులంతా మూకుమ్మడిగా ఇతర నెట్‌వర్క్‌లకు మారాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ వినూత్న నిరసన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
