చిట్యాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పలువురికి తీవ్ర గాయాలు
చిట్యాల, ఆంధ్రప్రభ: నల్గొండ జిల్లా చిట్యాల సమీపంలో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారిపై ప్రయాణిస్తున్న నాలుగు కార్లు ఒకదానికొకటి సిరీస్‌గా ఢీకొన్నాయి. ఈ క్రమంలో రెండు వాహనాలు అదుపుతప్పి రోడ్డుపైనే పల్టీలు కొట్టాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో కార్లు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి.
ఈ ఘోర ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా, వారిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి, వాహనాల్లో చిక్కుకుపోయిన క్షతగాత్రులను బయటకు తీశారు. అనంతరం అంబులెన్స్‌ల ద్వారా వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు క్రేన్ల సహాయంతో దెబ్బతిన్న వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, బాధితుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
