ప్రతి చిన్నారికి రెండు చుక్కలు వేయించాలి..

రాష్ట్ర మంత్రి సవిత, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు.

విజయవాడసెంట్రల్, ఆంధ్రప్రభ : ప్రతి చిన్నారికి రెండు పోలియో చుక్కలు వేయించడం ద్వారా వారి జీవితాలు సుఖంగా ఉంటాయని రాష్ట్ర మంత్రి సవిత, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.29వ డివిజన్ మధురానగర్ హెల్త్ సెంటర్‌లో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో 2026 కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని ఐదేళ్లలోపు చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాలను పరిశీలించి, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది అందిస్తున్న సేవలను అభినందించారు.ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ పోలియో వంటి ప్రమాదకర వ్యాధులను పూర్తిగా నిర్మూలించడంలో పల్స్ పోలియో కార్యక్రమం అత్యంత కీలకమని అన్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి వారి భవిష్యత్తును ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో పోలియో నిర్మూలనపై విస్తృత అవగాహన కల్పించడంతో పాటు ప్రజలకు అందుబాటులో అనేక పోలియో కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్లే భారతదేశం పోలియో రహిత దేశంగా నిలిచిందన్నారు.

మంత్రి సవిత మాట్లాడుతూ ప్రతి చిన్నారి ఆరోగ్యమే రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాదని అన్నారు. ఐదేళ్లలోపు ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు మిస్ కాకుండా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పోలియో కేంద్రాలు, మొబైల్ బృందాల ద్వారా బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా పోలియో చుక్కలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజల సహకారంతో ఆంధ్రప్రదేశ్‌ను శాశ్వతంగా పోలియో రహిత రాష్ట్రంగా కొనసాగిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ సోమన అనీల్ కుమార్,రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ సింగం వెంకన్న, డివిజన్ నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.