ఎస్‌ఐఆర్’లో ఓటర్లందరూ భాగస్వాములవ్వండి.
జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్
బీఎల్‌వోల పనితీరు పరిశీలన
సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలి
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతం పూర్తి చేసేందుకు ప్రతి ఓటరు భాగస్వామి కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పిలుపునిచ్చారు. ఆదివారం ఇందిరాగాంధీ మెమోరియల్ స్కూల్ సమీపంలో 100, 101, 102 పోలింగ్ బూత్‌ల పరిధిలో బిఎల్వోలు చేపడుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను జేసి, కర్నూలు నియోజకవర్గ ఈఆర్వో, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసుతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ.. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఓటరు సందేహాలను అక్కడికక్కడే నివృత్తి చేయాలని బీఎల్‌వోలను ఆదేశించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను దశలవారీగా కాకుండా సాధ్యమైనంత వరకు ఒకే సందర్శనలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఓటర్లు అవసరమైన పత్రాలను వెంట తీసుకువస్తే ప్రక్రియ మరింత సులభంగా పూర్తవుతుందని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఈఆర్వో, డిప్యూటీ తహశీల్దార్ ధనుంజయ, తదితరులు పాల్గొన్నారు.
