రెండు చుక్కలు చిన్నారుల బంగారు భవితకు…

0-5 సంవత్సరాలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరి..
ఈ నెల 29మరియు 30 తేదీల్లో మిగిలిపోయిన పిల్లలందరికీ పోలియో…
బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లలో ప్రత్యేక పోలియో కౌంటర్లు…
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

నంద్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : రెండు పోలియో చుక్కలు చిన్నారుల బంగారు భవితకు ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి పిలుపునిచ్చారు. ఆదివారం మూలసాగరంలోని ఎంఎస్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాగిరి వెంకటరమణ, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, మెప్మా పిడి వెంకట దాసు, జిల్లా పల్స్ పోలియో నోడల్ ఆఫీసర్ రమేష్, జిల్లా ఇమ్యూనెజేషన్ అధికారి సుదర్శన్ బాబు, ప్రోగ్రామ్ అధికారులు శారద బాయ్, లక్ష్మీ ప్రసన్న, డా.ఎన్టీఆర్ ట్రస్ట్ కోఆర్డినేటర్ రూపేంద్రనాథ్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశం పోలియో రహిత దేశంగా ఉన్నప్పటికీ చుట్టుపక్కల దేశాల్లో అక్కడక్కడ పోలియో కేసులు నమోదవ్వడం వల్ల వాటి నుండి పిల్లలను రక్షించడానికి సంవత్సరానికి రెండు సార్లు జూన్‌, డిసెంబర్‌లో ఒకసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతోందన్నారు. అందుకు గాను 0-5 సంవత్సరాలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలన్నారు. జిల్లాలో 2 లక్షల 38 వేల మంది చిన్నారులకు పోలియో చుక్కలు అందజేసేందుకు గాను 1320 చోట్ల పోలియో కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదే విధంగా ప్రయాణాల్లో ఉన్న చిన్నారుల కోసం బస్ స్టేషన్స్, రైల్వే స్టేషన్స్ దగ్గర కూడా పోలియో చుక్కల కేంద్రాలు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.

జ్వరం, జలుబు, విరేచనాలు ఉన్న పిల్లలకు కూడా ఈ టీకాలు వేయించవచ్చని, తల్లిదండ్రులు ఎలాంటి అపోహలకు తావివ్వకుండా, బాధ్యతగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత భారత్‌ను కాపాడుకోవడంలో భాగస్వాములు కావాలి అని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అదే విధంగా అత్వసర పరిస్థితుల్లో పోలియో కేంద్రాలకు వెళ్లలేని వారి కోసం ఈ నెల 29మరియు 30 తేదీల్లో మాప్-అప్ కార్యక్రమం ద్వారా మిగిలిపోయిన పిల్లలందరికీ పోలియో చుక్కలు వైద్య సిబ్బంది ద్వారా ఇంటింటికి వచ్చి పోలియో చుక్కలు అందజేయడం జరుగుతోందన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ, పంచాయతీ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, మున్సిపల్ శాఖలతో సమన్వయం చేసుకుంటూ జిల్లా అంతటా చిన్నారులకు అందజేయడం జరుగుతోందన్నారు.