కల్పవృక్ష వాహనంపై ప్రసన్న వేంకటేశ్వరుని దివ్య దర్శనం

కల్పవృక్ష వాహనంపై ప్రసన్న వేంకటేశ్వరుని దివ్య దర్శనం

  • రాజమన్నార్ అలంకారంలో భక్తులకు మంగళ దర్శనం
  • గోవింద నామస్మరణల మధ్య వైభవంగా వాహనసేవ
  • శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహణ
  • రాత్రికి సర్వభూపాల వాహనంపై స్వామివారి విహారం

తిరుపతి, ఆంధ్ర ప్రభ : అప్పలాయగుంటలో జరుగుతున్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం స్వామివారు రాజమన్నార్ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై విచ్చేసి భక్తులకు దివ్య మంగళ దర్శనం ఇచ్చారు. భక్తుల కోరికలను తీర్చే కల్పవృక్ష స్వరూపుడిగా స్వామివారు దర్శనమివ్వడంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.
ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వాహనసేవలో గోవింద నామస్మరణల మధ్య స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరించారు. మార్గమంతా భక్తులు కర్పూర హారతులు సమర్పించి, భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు.

వాహనసేవ అనంతరం ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు స్వామివారు కళ్యాణ మండపానికి వేంచేపు చేయగా, 4.30 నుంచి 6.30 గంటల వరకు ఆర్జిత కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలను తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉండటంతో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. రాత్రి 7 గంటలకు స్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చి ఆశీర్వదించనున్నారు. వాహనసేవలో డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ వేణుగోపాల్, అర్చకులు, అధికారులు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.