ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ నరసింహారావు..
ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ నరసింహారావు..
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : భారత మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కరణల పితామహుడు, తెలుగు జాతి కీర్తిని ఢిల్లీ పీఠంపై నిలబెట్టిన మహానేత స్వర్గీయ పీవీ నరసింహారావు అని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు పేర్కొన్నారు.
పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా కృష్ణా జిల్లా మచిలీపట్నం నగరంలో బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పీవీ ఫణికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కొనకళ్ల నారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీవీ నరసింహారావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ, పీవీ నరసింహారావు దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించి, సంస్కరణల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశానిర్దేశం చేశారని కొనియాడారు. ప్రధానమంత్రిగా దేశాభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.
తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడైన పీవీ నరసింహారావు సమైక్య భావనకు ప్రాధాన్యత ఇచ్చారని, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం వల్ల రాష్ట్రానికి నష్టం కలుగుతుందని భావించి సమైక్యత కోసం కృషి చేశారని గుర్తు చేశారు. దేశ రాజకీయ, ఆర్థిక రంగాల్లో ఆయన అందించిన సేవలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయని కొనకళ్ల నారాయణరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు ధనవంత ఆచార్యులు, పంతం గజేంద్ర, వెంకట్ సాయి, తదితర నాయకులు పాల్గొన్నారు
