పోలియో చుక్కలు ప్రతి చిన్నారికి రక్షణ కవచం

తిరువూరులో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆర్డీఓ ఏ. కుమార్

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని పిలుపు

పోలియో నుంచి జీవితాంతం రక్షణకు రెండు చుక్కలే భరోసా అని వెల్లడి

ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలతో కలిసి తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించిన అధికారులు

తిరువూరు, ఆంధ్రప్రభ: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం లక్ష్మీపురం గ్రామంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆర్డీఓ ఏ. కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి తల్లిదండ్రి సహకరించాలని పిలుపునిచ్చారు. పోలియో వ్యాధి నిర్మూలనలో పల్స్ పోలియో చుక్కలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, పిల్లలకు సమయానికి చుక్కలు వేయించడం ద్వారా జీవితాంతం రక్షణ కల్పించవచ్చని తెలిపారు.

కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. గ్రామంలో ఇంటింటికీ అవగాహన కల్పిస్తూ అర్హులైన ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా చర్యలు చేపట్టారు. పోలియో నిర్మూలన లక్ష్యాన్ని శాశ్వతంగా కొనసాగించేందుకు ప్రతి కుటుంబం బాధ్యతగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని అధికారులు కోరారు.