Telangana Rain Deficit | వర్షాభావంతో ఖరీఫ్ సాగు సంక్షోభంలో రైతులు
Telangana Rain Deficit | వర్షాభావంతో ఖరీఫ్ సాగు సంక్షోభంలో రైతులు
Telangana Rain Deficit | వానల కోసం ఎదురుచూపులు..
పెరుగుతున్న పెట్టుబడి భారం
వారం రోజుల్లో వర్షాలు లేకపోతే కరువు తప్పదా?
Telangana Rain Deficit | హైదరాబాద్, ఆంధ్రప్రభ : రోజులు గడుస్తున్నాయి. కార్తెలు కరిగిపోతున్నాయి. కానీ వాన చినుకు జాడ లేదు. ఖరీఫ్ సాగడం లేదు. ఇదీ ప్రస్తుతం రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్య. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు గడిచిపోతున్నా వరుణుడు కరుణించకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రోహిణి, మృగశిర కార్తెలు ముగిసి ఆరుద్ర కార్తె కూడా సగం పాదం గడిచిపోతున్నా తెలంగాణ వ్యాప్తంగా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. ఇప్పుడు ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. నైరుతిపై ఆశతో రైతులు ముందస్తుగా పత్తి, మొక్కజొన్న విత్తనాలు వేశారు.
తీరా చినుకు జాడ లేకపోవడంతో నేలచూపులు చూస్తున్నారు. భూమిలో తేమ లేక దుక్కులు ఎండిపోయి, నెర్రెలు వారుతున్నాయి. వేసిన విత్తనాలు మొలకెత్తకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పెట్టుబడి మొత్తం బూడిదలో పోసిన పన్నీరవుతుందేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు ఆలస్యమవుతుండడంతో ప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో పండే కంది, మొక్కజొన్న, ఆముదం, జొన్న, పత్తి వంటి పంటలను సాగు చేయాలని చెబుతున్నా ఇప్పటికే పత్తి, మొక్కజొన్నకు ఎకరానికి రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులు మళ్లీ ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేందుకు జంకుతున్నారు. రెండోసారి విత్తనాలు, ఎరువులు కొనాలంటే పెట్టుబడి రెట్టింపు అవుతోందని, అప్పులు పెరిగిపోతాయని భయపడుతున్నారు. దిగుబడి వస్తుందో లేదోననే అనుమానంతో ప్రత్యామ్నాయ పంటల సాగుకు అన్నదాతలు మొగ్గు చూపడం లేదు.
ఆరంభం నుంచీ అంతంతమాత్రమే…
ఈసారి ఖరీఫ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 101.3 మి.మీ. నమోదు కావాల్సి ఉండగా కేవలం 84.6 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది. జూన్ నెలలోనే ఈ లోటు ఏర్పడటంతో ఖరీఫ్ సాగుపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. చెరువులు, కుంటలు, బోర్లలో నీటిమట్టం పడిపోవడంతో రోహిణిలోనే వరినార్లు వేసినా నాటు వేసేందుకు పొలం తడిసే అవకాశం కనిపించడం లేదు.
సిద్ధిపేట, హన్మకొండ జిల్లాల్లో భారీగా వర్షపాతం లోటు ఉండగా.. ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, మెదక్, వరంగల్, మహబూబాబాద్, జనగామ, మేడ్చల్, జోగులాంబ గద్వాల, యాదాద్రి జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్‌లో మొత్తం 1.32 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కావాల్సి ఉండగా… ఇప్పటి వరకు దాదాపు 15 లక్షల ఎకరాల్లోనే రైతులు పంటలు వేశారని వ్యవసాయశాఖ రోజువారీ సాగు వివరాల నివేదిక స్పష్టం చేస్తోంది. గతేడాది ఇదే సమయానికి దాదాపు 30 లక్షల ఎకరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పంటలు సాగయ్యాయి. ఈ వానాకాలంలో 62.47 లక్షల ఎకరాల్లో వరి సాగు లక్ష్యంగా ఉండగా ఇప్పటి వరకు వేల ఎకరాల్లో మాత్రమే వరినాట్లు పడడం వర్షాభావ పరిస్థితులతో ఎదురుకాబోతున్న దుర్భిక్ష పరిస్థితులకు అద్దంపడుతోంది.
పత్తిని బతికించుకునేందుకు పాట్లు
ఈసారి 50.13 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేయగా ఇప్పటికే రైతులు లక్షలాది ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటారు. వర్షాలు లేకపోవడంతో వేసిన విత్తనాలు మొలకెత్తడం లేదు. దీంతో కొందరు డ్రిప్, మరికొందరు బోర్ల నీటితో పత్తి దుక్కులను, అక్కడక్కడా మొలకెత్తిన పత్తి విత్తనాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. జూన్ ప్రారంభం నుంచి జూలై మొదటి వారం వరకు పత్తి విత్తనాలు విత్తేందుకు అనుకూల సమయం అని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పత్తి విత్తనాలు విత్తడం ఆలస్యమైతే దిగుబడిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తంగా తొలకరి వర్షాలు కురుస్తాయని పత్తి విత్తనాలు విత్తుకున్న వారి ఆశలు అడియాశలయ్యాయి. జూన్ మొదటి వారంలో విత్తుకున్న విత్తనాలు మొలకెత్తకుండానే పాడైపోయాయి. మరోసారి విత్తుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రైతులపై అదనపు పెట్టుబడి భారం పడుతోంది. కనీసం 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతేనే పత్తి విత్తనాలు వేసుకోవాలని వ్యవసాయశాఖ స్పష్టం చేస్తోంది. వారం రోజుల్లో వర్షాలు కురిస్తేనే పంటలు దక్కుతాయని, నాటిన పత్తి విత్తనాలు మొలకెత్తుతాయని, లేకపోతే కరువు కమ్ముకోవడం ఖాయమని రైతులు వాపోతున్నారు.
