Modi Cabinet | మోడీ కేబినెట్లో దక్షిణాదికి తక్కువ ప్రాధాన్యం
Modi Cabinet | మోడీ కేబినెట్లో దక్షిణాదికి తక్కువ ప్రాధాన్యం
Modi Cabinet | దక్షిణాదిలో బీజేపీకి బలమైన నాయకత్వం అవసరం
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో దిగ్గజాలకు చోటు దక్కుతుందా?
Modi Cabinet | ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గంలో భారీ మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుత మంత్రివర్గంలో అసమర్థులనూ, రాజకీయంగా దీటుగా వ్యవహరించని వారిని తొలగించాలని మోడీ చాలా కాలంగా యోచిస్తున్నారు. మంత్రివర్గ నిర్మాణం, కూర్పులలో మన దేశం బ్రిటిష్ సంప్రదాయాన్ని పాటిస్తోంది. అయితే, గత దశాబ్దిలో బ్రిటన్లో ఏడుగురు ప్రధానులు, డజన్ల కొద్దీ మంత్రులు మారారు. కానీ భారత ప్రధానులు అలాంటి సాహసం చేయరు. సరిగ్గా పనిచేయలేదన్న కారణంగా కేబినెట్ నుంచి తప్పించిన సందర్భాలు అరుదు. అవినీతి కుంభకోణాల్లో చిక్కుకుంటే తప్ప మంత్రులకు పదవీ గండం ఉండదు.
మోడీ కేబినెట్లో అసమానతలు
దక్షిణాది రాష్ట్రాల్లో 140 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. రాజ్యాంగం ప్రకారం మొత్తంగా కేంద్ర కేబినెట్లో 81 మందిని మంత్రులుగా నియమించవచ్చు. ఈ లెక్కన దక్షిణాదికి సముచిత ప్రాధాన్యం దక్కాలి. కానీ ప్రస్తుతం మోడీ కేబినెట్లో ప్రాతినిధ్యం కలిగి ఉన్నది 12 మంది మాత్రమే. పైగా వీరంతా తక్కువ ప్రాధాన్యం కలిగిన శాఖలకు మంత్రులుగా ఉన్నారు. వీరేమీ రాజకీయ ఉద్ధండులు కారు. తమ తమ రాష్ట్రాల్లో విశేష ప్రజాభిమానాన్ని చూరగొన్నవారు అంతకంటే కాదు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి తప్ప మిగిలిన వారిలో సీనియర్లు లేరు. కేంద్ర కేబినెట్లో దక్షిణాదికి చెందిన బలమైన నాయకుడు ఉండటం జాతీయ ఐక్యత దృష్ట్యా, మోడీకి అండగా ఉండటం కోసం అత్యవసరం.
దిగ్గజాలు ఎందుకు?
మొదటిది: మంత్రులు స్వతంత్రంగా, రాజకీయ అనుభవం కలిగిన వారై ఉండాలి. చోటామోటా నేతలతో కేబినెట్ కూర్పు వల్ల మంత్రివర్గం బలహీనంగా ఉంటుంది. రాజకీయ అనుభవం లేని సహచరుల కారణంగా అన్ని విషయాలనూ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా చూసుకోవాల్సి వస్తోంది. సీనియర్ నేతలు, ప్రజల్లో పలుకుబడి కలిగిన వారు మంత్రులుగా కేబినెట్లో ఉండాలి. ఎన్నికల వేళ ప్రజల్లోకి వెళ్లేందుకు సమర్థులైన, బలమైన నాయకులు మంత్రివర్గంలో ఉండాలి.
రెండవది: గత పదేళ్లుగా దక్షిణాదిన పార్టీని విస్తరింపజేయడానికి బీజేపీ ఎంతో శ్రమిస్తోంది. దక్షిణాదిన పలుకుబడి, సమర్థత గల నాయకులు లేనందువల్ల కాషాయ పార్టీ ఆశించిన స్థాయిలో ఎదగడం లేదు. మోడీ ఒక్కరే ప్రజాదరణ కలిగిన నాయకులు. రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చినప్పుడు మోడీ ఒక్కరే కష్టపడాల్సి వస్తోంది. రాష్ట్రస్థాయి నాయకులెవరూ ఎన్నికల్లో పార్టీని గెలిపించే శక్తియుక్తులు కలిగి లేరు.
మూడవది: అసోం, పశ్చిమ బెంగాల్లో పలుకుబడి కలిగిన ప్రాంతీయ నాయకులు ఏ విధంగా పార్టీని నడిపిస్తున్నారో, అలాంటి సమర్థులైన నాయకులు మిగతా రాష్ట్రాల్లో లేరు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అలాంటి నాయకులు లేరు. పార్టీ వ్యవస్థకు అతీతంగా తన పిలుపుతో అందరినీ కూడగట్టగల నాయకులు ఎవరూ లేరు.
కొత్త దిగ్గజాలను తయారు చేయడం
పార్టీలో గట్టి నాయకులు లేని చోట్ల బీజేపీ అటువంటి వారిని తయారు చేయాలి. ప్రభుత్వ పదవుల్లోనూ, పార్టీలోనూ నియమించడం వల్ల ప్రభుత్వ, పార్టీ ప్రతిష్ట పెరుగుతుంది. ఉదాహరణకు కర్ణాటకలో మాజీ ముఖ్యమంత్రులు బి.ఎస్. యడియూరప్ప, డి.వి. సదానంద గౌడ, బసవరాజ్ బొమ్మయ్, జగదీష్ షెట్టార్లాంటి వారి సేవలను వినియోగించుకోవచ్చు. కర్ణాటక నుంచి ఐదుగురు కేంద్ర మంత్రులు ఉన్నారు. వారిలో ఏ ఒక్కరూ కూడా ప్రజాదరణ కలిగిన వారు లేరు. బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా వంటి వారిని కేబినెట్లో చేర్చుకోవడం వల్ల ప్రతిష్ట పెరుగుతుంది. పార్టీకి వెలుపల మంచి పేరున్న వారిని బీజేపీ తీసుకురావాలి. అసోం, బెంగాల్లో ఇతర పార్టీల నుంచి మంచి వారిని తమ పార్టీలోకి ఆహ్వానించాలి.
బీజేపీ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పార్టీని విస్తరింపజేయడానికి చర్యలు తీసుకుంది. తమిళనాడు, కేరళలో సమర్థులైన నాయకులు ఆ పార్టీకి కనిపించడం లేదు. అక్కడ ఇతర పార్టీలకు చెందిన స్థానిక నాయకులను బీజేపీ తిరస్కరిస్తోంది.
ఆర్థిక, విదేశాంగ శాఖ మంత్రులు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్ ఇద్దరూ తమిళనాడు మాతృభాష కలిగిన వారే. వీరిలో ఏ ఒక్కరూ స్థానికంగా పట్టున్న వారు కారు. వీరిద్దరూ 2024 ఎన్నికల్లో పోటీ చేయడానికి నిరాకరించారు.
పూర్వపు కేబినెట్ల నుంచి పాఠాలు
పీవీ నరసింహారావు, రాజీవ్ గాంధీ కేబినెట్లలో చాలా మంది మాజీ ముఖ్యమంత్రులు, అనుభవం కలిగిన నాయకులు, రాజకీయంగా బలం ఉన్నవారు ఉండేవారు. అప్పట్లో దక్షిణాది నుంచి ఎక్కువ మంది కేంద్ర మంత్రులు ఉండేవారు. దక్షిణాదిలో బలమైన నాయకులకు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇచ్చేది. ఇప్పుడు సొంత పార్టీ వారి కన్నా మోడీ పలుకుబడిపైనే బీజేపీ ఆధారపడుతోంది. ప్రజల్లో మంచి పలుకుబడి, పట్టు ఉన్న వారిని కేబినెట్లోకి తీసుకోవాలి. మన దేశంలో ప్రాంతీయంగా బలమైన నాయకులకు కేంద్రంలో ప్రాధాన్యం లభించేది.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. దక్షిణాదిన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. అలాంటి పార్టీలకు చెందిన వారికి చెప్పుకోదగిన శాఖలు ఇచ్చి ప్రోత్సహించాలి. ప్రధానమంత్రి మోడీ రాజకీయాల్లో లేని సమర్థులైన వారిని తన కేబినెట్లోకి తీసుకోవాలి. మాజీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, ఎడప్పాడి పళనిస్వామి వంటి వారిని ప్రోత్సహించాలి.
దక్షిణాదిన బీజేపీ తన బలాన్ని పెంచుకుంటోంది. 140 మంది ఎంపీలలో 29 మంది ఆ పార్టీకి చెందిన వారున్నారు. కర్ణాటకలోనే ఈ బలం ఎక్కువ. అయితే క్రమంగా తగ్గుతోంది. 2019లో 26 మంది ఎంపీలు ఉండగా, 2024లో అది 17కి పడిపోయింది. బీజేపీ దక్షిణాదిలో తన పట్టును పెంచుకోవడానికి సమర్థులైన, గట్టి నాయకులకు పదవులు ఇవ్వాలి. ఈసారి జరిపే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో వారికి ప్రాధాన్యం ఇవ్వాలి.
రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయా రంగాల్లో సమర్థులైన వారిని నియమించాలి. ఉదాహరణకు పీవీ నరసింహారావు తన కేబినెట్లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ను నియమించారు. ఆయన ఆ పదవిని ఎంతో సమర్థవంతంగా, విజయవంతంగా నిర్వహించారు. దాంతో ఆయన 2004లో ప్రధానమంత్రి అయి 2014 వరకు ఉన్నత పదవిలో కొనసాగారు. అటువంటి వారిని మోడీ కూడా ఎంపిక చేయవచ్చు. అలా మరికొంత మంది మన్మోహన్ సింగ్లను తయారు చేయవచ్చు.
డా. పెంటపాటి పుల్లారావు
9350833188
