మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి..

  • మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం..
  • విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించిన అధికారులు

మహబూబాబాద్, ఆంధ్రప్రభ : మత్తు పదార్థాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాల నిర్మూలనలో యువత కీలక పాత్ర పోషించాలని మహబూబాబాద్ జిల్లా అధికారులు పిలుపునిచ్చారు.

జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ సూచనల మేరకు శనివారం మహబూబాబాద్ పట్టణంలోని స్నేహనగర్‌లో గల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎంఆర్ఎస్), గూడూరులో స్త్రీ, శిశు సంక్షేమ, వయోవృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంబంధిత శాఖల అధికారులతో కలిసి మాదకద్రవ్యాల నివారణపై అవగాహన సమావేశం నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, డీఎంహెచ్‌వో డాక్టర్ రవి రాథోడ్, డీఎస్పీ తిరుపతిరావు, ఇన్‌చార్జి సంక్షేమ అధికారి శిరీష, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ట్రైనీ) నిశాంత్ కుమార్, ఇంటర్మీడియట్ విద్యాధికారి మదర్, డీవైఎస్‌వో జ్యోతి, విద్యాశాఖ అధికారులు శ్రీరాములు, అప్పారావు, పాఠశాల ప్రిన్సిపాల్ రమేష్ కుమార్ తదితరులు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

ఈ సందర్భంగా డీఎస్పీ తిరుపతిరావు మాట్లాడుతూ, జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని తెలిపారు. అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించడంతో పాటు రాత్రి వేళల్లో పోలీసులు మఫ్టీలో ద్విచక్ర వాహనాలపై గస్తీ నిర్వహిస్తూ గంజాయి సేవిస్తున్న వారిని గుర్తించి కౌన్సెలింగ్ చేస్తున్నట్లు చెప్పారు.

గంజాయి సాగు, రవాణా, విక్రయాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో గంజాయి సాగు లేదా రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన వారు 1098 నంబర్‌కు సమాచారం అందించాలని, సమాచారదాత వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటు నగదు ప్రోత్సాహకం కూడా అందజేస్తామని తెలిపారు.

బాల్యవివాహాల నివారణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ఇప్పటివరకు సుమారు 100 బాల్యవివాహాలను అడ్డుకున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో విద్యార్థులు మాదకద్రవ్యాల నివారణపై ప్రసంగాలు, పాటలు ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్లు చిరంజీవి, సంబంధిత శాఖల సిబ్బంది చైతన్య, కమలాకర్, వీరన్న, నరేష్, హరీష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.