ఇంద్రకీలాద్రిపై భక్తుల జాతర…

భారీగా తరలివచ్చిన భక్తజనం..

ఇంద్రకిలాద్రి, ఆంధ్రప్రభ : ప్రభుత్వ సెలవు దినం కావడంతో శుక్రవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. అంతరాలయ దర్శనం నిలిపివేత భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో అందరికీ త్వరితగతిన దర్శనం కల్పించేందుకు ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు అంతరాలయ దర్శనంతో పాటు వి.ఐ.పి దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు. కేవలం సర్వదర్శనం లైన్ల ద్వారానే భక్తులను అనుమతించారు.

భక్తులకు విస్తృత సదుపాయాలు..

ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లలో ఉన్న భక్తుల కోసం మొబైల్ టిన్ల ద్వారా చల్లని తాగునీటిని నిరంతరాయంగా పంపిణీ చేశారు. అలాగే ఆలయానికి వచ్చిన భక్తులందరికీ సరిపడా ఉచిత ప్రసాదం, నిత్యాన్నదాన వితరణను విస్తృతంగా ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షించారు.