ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అందరి సహకారం అవసరం

ముగ్ధంపురం పాఠశాల పరిరక్షణ కమిటీ సమావేశంలో వక్తలు

నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : ముగ్గంపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో బుధవారం ఉదయం పాఠశాల పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. పాఠశాల కమిటీ చైర్మన్ అమిలి అప్పలపూడి అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీటీసీ చీకటి స్వరూప్ ఓదయ్య, గ్రామ పెద్దలు, ప్రజాప్రతి నిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చీకటి స్వరూప్
ఓదయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయని, నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్, యూనిఫాంలు అందజేస్తున్నారని చెప్పారు. అలాగే మధ్యాహ్న భోజన పథకం కింద వారానికి మూడు రోజులు గుడ్లు, మూడు రోజులు రాగి జావ అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గ్రామంలోని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు.
పాఠశాలకు మినరల్ వాటర్ సౌకర్యం కల్పించడంతో పాటు కంప్యూటర్ ఆధారిత విద్యాభివృద్ధికి అవసరమైన ఏర్పాట్లు చేయడానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా విద్యార్థుల రవాణా కోసం ఆటో సౌకర్యం కల్పిస్తానని పొనుగోటి కిషన్‌రావు తెలిపారు. 2వ వార్డు కౌన్సిలర్ అమటి ఇస్లావత్ రమ మాట్లాడుతూ తన వార్డుకు చెందిన పిల్లలను పాఠశాలలో చేర్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటానని చెప్పారు. గ్రామ ప్రజలు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో పాఠశాల ఉపాధ్యాయులు, కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.