అమాయక గిరిజనులపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గం

  • ఇప్పల్ తండ గిరిజనులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది
  • ఈర్ల నర్సింహ రాములు,

నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : ఇప్పల్ తండలోని అమాయక గిరిజనులపై అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపడం దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహ రాములు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి ముసుగులో అరాచకాలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. సోమవారం ఇప్పల్ తండలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తండాలో గిరిజనుల ఆరాధ్య దైవమైన శ్రీ శీతల భవాని అమ్మవారి పండుగలు నిర్వహించే స్థలంలో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం చేపట్టడంపై గ్రామస్తులు, తండా పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిపారు.

ఈ అంశంపై శాంతియుతంగా చర్చించేందుకు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని కలిసేందుకు వెళ్లిన గిరిజనులపై కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. దాడికి గురైన గిరిజనులపైనే అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపడం అత్యంత బాధాకరమని, దాడి చేసిన వారిని వదిలేసి బాధితులపై కేసులు నమోదు చేయడం పోలీసుల పక్షపాత వైఖరికి నిదర్శనమని అన్నారు. ఎమ్మెల్యే ఒత్తిడితో గిరిజనులను పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు.

అభివృద్ధి పేరుతో తండాల్లో రాజకీయ చిచ్చు పెట్టి, కుటుంబాలను విడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, గిరిజనుల మనోభావాలను గౌరవించకుండా వారి సంస్కృతి, సంప్రదాయాలకు భంగం కలిగించే చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేటను శాంతియుత వాతావరణంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని గుర్తుచేసిన ఆయన, ఇప్పల్ తండ గిరిజన కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌చార్జి భూక్య వీరన్న, మండల కమిటీ ఉపాధ్యక్షుడు అల్లి రవి, నాయకులు బుర్ర ఆనంద్, ఇప్పల్ తండ ఉపసర్పంచ్ ధారావత్ సురేందర్, మాజీ సర్పంచ్ బానోత్ సుజాత, మాజీ వార్డు సభ్యుడు జాటోత్ రవి, ధారావత్ పాండా, అశోక్, బుచ్చ, శీను తదితరులు పాల్గొన్నారు.